ప్లస్ 265 నుంచి మైనస్ 5కు సెన్సెక్స్
♦ చివర్లో లాభాల స్వీకరణ
♦ ఫార్మా, రియల్టీ షేర్లలో అమ్మకాలు
♦ 5 పాయింట్ల నష్టంతో 24,677కు సెన్సెక్స్
♦ 14 పాయింట్ల లాభంతో 7,513కు నిఫ్టీ
అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయంతో గురువారం మధ్యాహ్నం వరకూ ర్యాలీ జరిపిన స్టాక్ మార్కెట్ చివర్లో లాభాల స్వీకరణ కారణంగా ఫ్లాట్‌గా ముగిసింది. ఇంట్రాడేలో 265 పాయింట్లు లాభపడిన బీఎస్‌ఈ సెన్సెక్స్ ట్రేడింగ్ చివర్లో ఫార్మా, రియల్టీ షేర్లలో అమ్మకాల కారణంగా 5 పాయింట్ల నష్టంతో 24,677 పాయింట్ల వద్ద ముగిసింది. కీలకమైన 7,500 పాయింట్లను దాటిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 7,513 పాయింట్లకు చేరింది. చివర్లో ఫార్మా, లోహ, రియల్టీ షేర్లలో అమ్మకాలు జరిగాయి. లుపిన్ గోవా ప్లాంట్‌పై యూఎస్ ఎఫ్‌డీఏ అసంతృప్తి ఆ స్టాక్‌పై ప్రతికూల ప్రభావం చూపింది.
ఫెడ్ నిర్ణయ ప్రభావం...: అంతర్జాతీయ వృద్ధి అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ ఏడాది రేట్ల పెంపు రెండు సార్లు మాత్రమే ఉండగలదని అమెరికా ఫెడ్ బుధవారంనాటి సమావేశం సందర్భంగా సూచించడంతో స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. నాలుగు సార్లు రేట్ల పెంపు ఉంటుందన్న అంచనాలకు భిన్నంగా ఫెడ్ నిర్ణయం ఉండటం, ప్రస్తుతం రేట్లను పెంచకపోవడంతో స్టాక్ మార్కెట్లు పెరిగాయి. ఫెడ్ నిర్ణయం వల్ల భారత్ వంటి వర్థమాన దేశాలకు విదేశీ నిధులు వస్తాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబా హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. ఫెడ్ నిర్ణయంతో లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 24,948 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. బుధవారం నాటి ముగింపుతో పోల్చితే 265 పాయింట్లు లాభపడింది. బ్లూ చిప్ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా 24,577 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. మొత్తం మీద సెన్సెక్స్ 371 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. చివరకు 5 పాయింట్ల నష్టంతో 24,677 పాయింట్ల వద్ద ముగిసింది. లాభాల్లో ప్రారంభమైన యూరప్ మార్కెట్లు నష్టాల్లోకి జారిపోవడం ప్రతికూల ప్రభావం చూపించింది.