ఐవీఆర్‌సీఎల్‌లో బ్యాంకుల చేతికి మెజార్టీ వాటా
♦ మూడింట రెండొంతుల షేర్లకు బీమా సంస్థల నుంచి బిడ్లు
♦ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతంతమాత్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇచ్చిన రుణాల్లో కొంత భాగాన్ని ఈక్విటీగా మార్చుకొని ఐవీఆర్‌సీఎల్‌లో మెజార్టీ వాటాను తీసుకోవాలని బ్యాంకులు నిర్ణయించాయి. స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా కంపెనీలో 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ శాతం వాటాను తీసుకోవాలని ఎస్‌బీఐ నేతృత్వంలోని 20 బ్యాంకుల జాయింట్ లెండర్స్ ఫోరమ్ (జేఎల్‌ఎఫ్) నిర్ణయించినట్లు ఐవీఆర్‌సీఎల్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియ చేసింది. రెండు రూపాయల ముఖ విలువ కలిగిన షేరును ఎస్‌డీఆర్ కింద రూ. 8.765 చొప్పున ఈక్విటీగా మార్చుకోనున్నాయి. ప్రస్తుతం కంపెనీ షేరు రూ. 7 వద్ద కదులుతోంది.
ఫిబ్రవరి 23న జరిగిన జేఎల్‌ఎఫ్ సమావేశంలో ఎస్‌డీఆర్ ప్యాకేజీకి బ్యాంకులు ఆమోదముద్ర వేశాయి. ఇప్పటికే ఈ జేఎల్‌ఎఫ్‌కి కంపెనీలో సుమారుగా 49 శాతం వాటా ఉంది. కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా రూ. 7,350 కోట్ల రుణానికి సంబంధించి బ్యాంకులు ఇప్పటికే ఈక్విటీగా మార్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐవీఆర్‌సీఎల్ రుణ భారం సుమారు రూ. 9,000 కోట్లు దాటినట్లు మార్కెట్ వర్గాల సమాచారం. బ్యాంకులు మెజార్టీ వాటాను తీసుకున్న తర్వాత కంపెనీని పునర్ వ్యవస్థీకరించి సరైన ధర లభిస్తే వేరే వారికి విక్రయించాలన్నది జేఎల్‌ఎఫ్ ఆలోచన.