ఎల్‌జీ నుంచి 4జీ రెడీ ఫోన్
గుర్గావ్: ఎల్‌జీ కంపెనీ 4జీ రెడీ స్మార్ట్‌ఫోన్, ఎల్‌జీ జీ2 ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్‌ను 16జీబీ, 32 జీబీ మెమెరీల్లో అందిస్తున్నామని, ధరలు రూ.41,500 నుంచి ప్రారంభమవుతాయని ఎల్‌జీ ఇండియా ఎండీ, సూన్ క్వాన్ చెప్పారు. ఈ రెండు ఫోన్లలోనూ ఎక్స్‌పాండబుల్ మెమెరీ లేదని, అయితే ఈ ఫోన్ల జీవిత కాలం వరకూ 50 జీబీ క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా ఆఫర్ చేస్తామని తెలిపారు. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 5.1 అంగుళాల డిస్‌ప్లే, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2.1 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. క్విక్ రిమోట్ ఫీచర్ కారణంగా ఇంట్లో ఉన్న టీవీ, హోమ్ థియేటర్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ఫంక్షన్స్‌ను కంట్రోల్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.
3జీ నెట్‌వర్క్‌ను కూడా ఈ ఫోన్‌లు సపోర్ట్ చేస్తాయని ఎల్‌జీ ఇండియా మార్కెటింగ్ హెడ్ అమిత్ గుజ్రాల్ చెప్పారు. 4జీ నెట్‌వర్క్ సిద్ధం కాగానే ఈ ఫోన్‌లను అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. వచ్చే ఏడాది చివరికల్లా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 10 శాతం వాటా సాధించడం లక్ష్యమని సూన్ క్వాన్ పేర్కొన్నారు. ఒక్క ఎల్‌జీ జీ2 ఫోన్ల విక్రయాలతోనే రూ,150-200 కోట్ల టర్నోవర్ సాధించాలనుకుంటున్నామని వివరించారు