లిక్విడ్ ఫండ్స్ పెట్టుబడులపై పన్నులుంటాయా?
లిక్విడ్ ఫండ్స్‌పై పన్నులు ఎలా ఉంటాయి? లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి వాటిపై లాభాలనార్జిస్తే, ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా?
– సాగర్, విశాఖపట్టణం
లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే గడించే మూలధన లాభాలపై పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన లిక్విడ్ ఫండ్స్ యూనిట్లను మూడేళ్లలోపు విక్రయిస్తే, వాటిపై వచ్చే లాభాలపై మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ లాభాలను మీ మొత్తం ఆదాయానికి జత చేసి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. ఒక వేళ మూడేళ్ల కాలానికి మించిన తర్వాత ఈ యూనిట్లను విక్రయిస్తే, వీటిపై వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై 20 శాతం పన్ను (ఇండెక్సేషన్ ప్రయోజనంతో కలుపుకొని) చెల్లించాల్సి ఉంటుంది.
నా భార్య ఒక ప్రైవేట్ కంపెనీలో ఆరేళ్లు పనిచేసి మానేసింది. ఇటీవలే ప్రావిడెండ్ ఫండ్(పీఎఫ్) మొత్తాన్ని విత్‌డ్రా చేసింది. ఈ విత్‌డ్రా చేసిన మొత్తంపై పీఎఫ్ డిపార్ట్‌మెంట్ ఎలాంటి పన్నుకోత విధించలేదు. ఐటీ రిటర్న్ దాఖలు చేసేటప్పుడు ఈ పీఎఫ్ విత్‌డ్రాయల్‌ను చూపించాలా ? ఒక వేళ చూపించాల్సి వస్తే, ఈ మొత్తాన్ని ఏ పద్దు కింద చూపించాలి?
– వివేక్, హైదరాబాద్
రెండు సందర్భాల్లో ఈపీఎఫ్‌ఓ(ఎంప్లాయీ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్) పీఎఫ్ విత్‌డ్రాయల్స్‌పై టీడీఎస్(ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) ను విధిస్తుంది. మొదటి సందర్భం,..ఈపీఎఫ్ విత్‌డ్రాయల్ మొత్తం రూ.50,000 కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఇక రెండోది. ఎవరైనా ఉద్యోగి ఒక కంపెనీలో నిరంతరంగా ఐదేళ్లలోపే పనిచేసి, పీఎఫ్ విత్‌డ్రాయల్ మొత్తం రూ.50,000 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు.. ఈ రెండు సందర్భాల్లోనే పీఎఫ్ విత్‌డ్రాయల్‌పై టీడీఎస్ ఉంటుంది. మీ భార్య ఒక కంపెనీలో 5 ఏళ్లకు మించి పనిచేసినందున పీఎఫ్ విత్‌డ్రాయల్‌పై ఎలాంటి టీడీఎస్‌ను ఈపీఎఫ్‌ఓ విధించలేదు. ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసేటప్పుడు ఈ పీఎఫ్ మొత్తాన్ని కూడా చూపించాల్సి ఉంటుంది. వేతనం నుంచి ఆదాయం అనే పద్దు కింద ఈ మొత్తాన్ని చూపించాల్సి ఉంటుంది.
నేను కొంత మొత్తానికి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ క్లిక్ 2 ప్రొటెక్ట్ అనే టర్మ్ ప్లాన్‌ను తీసుకున్నాను. అయితే ఈ ప్లాన్‌లో యాక్సిడెంట్ బెనిఫిట్, క్రిటికల్ ఇల్‌నెస్‌లకు కవరేజ్ లేదు. ఈ రెండు కవరేజ్‌లు ఉన్న మరో టర్మ్ ప్లాన్, ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్ ఐ స్మార్ట్–లైఫ్ ఆప్షన్‌ను అదనంగా తీసుకోవాలనుకుంటున్నాను. ఇలా అదనపు టర్మ్ ప్లాన్‌ను తీసుకోవాలా ? లేక హెచ్‌డీఎఫ్‌సీ సంస్థనే ఈ రెండు కవరేజ్‌లు కూడా జత చేయమని అడిగి కొంచెం ఎక్కువగా ప్రీమియమ్ చెల్లించాలా ? తగిన సలహా ఇవ్వగలరు ?
– నాగేశ్, విజయవాడ
క్రిటికల్ ఇల్‌నెస్, పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ ప్రయోజనాలు ఉన్న మరో టర్మ్ ప్లాన్‌ను తీసుకుంటే ఎక్కువ ప్రయోజనమా ?లేక ప్రస్తుతమున్న టర్మ్‌ప్లాన్‌కే రైడర్‌లను జత చేస్తే ఎక్కువ ప్రయోజనమా అనే విషయాలపై మీరు ముందుగా మదింపు చేయండి. మీరు ప్రస్తుతం తీసుకున్న హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ క్లిక్ 2 ప్రొటెక్ట్ టర్మ్ ప్లాన్‌కు క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్‌ను జత చేయవచ్చు. కొంత అధిక ప్రీమియమ్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక 30 ఏళ్ల పొగ తాగని వ్యక్తికి 30 ఏళ్ల బేసిక్ లైఫ్ కవర్‌కు ప్రీమియమ్ ఏడాదికి రూ.10,332గా ఉంటుంది. దీనికి క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్‌ను జత చేశారనుకోండి, అప్పుడు చెల్లించాల్సిన ప్రీమియమ్‌రూ.15,979కు పెరుగుతుంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్‌ను కూడా జత చేస్తే, ప్రీమియమ్ రూ.21,698కు పెరుగుతుంది. ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్ ఐ స్మార్ట్‌ను తీసుకుంటే, ఈ ప్లాన్‌కు సంబంధించి బేసిక్ కవరేజ్ ఒక 30 ఏళ్ల పొగ తాగని వ్యక్తికి 30 ఏళ్ల బేసిక్ లైఫ్ కవర్‌కు ప్రీమియమ్ ఏడాదికి రూ.8,906గా ఉంది. దీనికి క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్‌ను జత చేస్తే, అప్పుడు చెల్లించాల్సిన ప్రీమియమ్ రూ.13,074కు పెరుగుతుంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్‌ను కూడా జత చేశారనుకోండి, ప్రీమియమ్ రూ.18,742కు పెరుగుతుంది. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోండి.
బ్యాంక్ సేవింగ్స్ ఖాతాకు ప్రత్యామ్నాయంగా ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను పరిగణించవచ్చా ? ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని మంచి ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను సూచించండి?
– తేజశ్విని, ఈమెయిల్
బ్యాంక్ సేవింగ్స్ ఖాతాతో పోల్చితే ఆర్బిట్రేజ్ ఫండ్స్ మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ దాదాపు లిక్విడ్ ఫండ్స్‌లాంటివే. ఈ ఫండ్స్ ద్వారా వచ్చే డివిడెండ్‌లపై మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఆర్బిట్రేజ్ ఫండ్స్‌కు ఉన్న మంచి ఆకర్షణీయ అంశాల్లో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు. సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్ములపై వచ్చే రాబడుల కన్నా, ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రాబడులే అధికంగా ఉంటాయి మీరు ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని ఫండ్స్‌ను సూచిస్తున్నాం. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ ఆర్బిట్రేజ్ ఫండ్, ఐడీఎఫ్‌సీ ఆర్బిట్రేజ్ ఫండ్, జేఎం ఆర్బిట్రేజ్ అడ్వాంటేజ్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా ఆర్బిట్రేజ్ ఫండ్, కోటక్ ఈక్విటీ ఆర్బిట్రేజ్ ఫండ్, రిలయన్స్ ఆర్బిట్రేజ్ అడ్వాండేజ్ ఫండ్, ఎస్‌బీఐ ఆర్బిట్రేజ్ అపర్చునిటీస్ ఫండ్. ఈ ఫండ్స్‌లో ఏదో ఒకదానిని ఎంచుకొని ఆ ఫండ్ డైరెక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయండి.