ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ కౌంటర్ మరోసారి వెలుగులో నిలుస్తోంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఈ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 2336ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 4 శాతం లాభంతో రూ. 2273 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ప్రారంభమైన తొలి అర్ధగంటలోనే ఈ కౌంటర్లో ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో కలిపి 1.7 లక్షల షేర్లు చేతులు మారడం గమనార్హం!
క్యూ1 భేష్
సాఫ్ట్‌వేర్ సేవల కంపెనీ ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో నికర లాభం 17 శాతం పుంజుకుని రూ. 415 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 19 శాతం పెరిగి రూ. 2,949 కోట్లను అధిగమించింది. పన్నుకు ముందు లాభం 17 శాతం ఎగసి రూ. 556 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 0.9 శాతం బలపడి 20.1 శాతానికి చేరాయి. జూన్ చివరికల్లా కంపెనీలో 31,477 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నట్లు ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ ఫలితాల విడుదల సందర్భంగా వెల్లడించింది. ఉద్యోగ వలస రేటు 1.3 శాతం తగ్గడంతో 15.2 శాతంగా నమోదైనట్లు తెలియజేసింది. వార్షిక ప్రాతిపదికన వెల్లడించిన ఫలితాలివి.
Comments
Please login to add a commentAdd a comment