ఈ నెలాఖరువరకూ నాలుగోసారి లాక్‌డవున్ పొడిగించినప్పటికీ పలు ఆంక్షలను సడలించిన నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ప్రోత్సాహకరంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 ప్రాంతంలో సెన్సెక్స్
149 పాయింట్లు పుంజుకుని 30,345కు చేరింది. నిఫ్టీ సైతం 46 పాయింట్లు బలపడి 8,925 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో సాప్ట్‌వేర్ సేవల కంపెనీ ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్, విద్యుత్ రంగ కంపెనీ టాటా పవర్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..
ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్
ఐటీ సేవల కంపెనీ ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 427 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 13 శాతం అధికంకాగా.. మొత్తం ఆదాయం సైతం 7 శాతం పెరిగి రూ. 3012 కోట్లను తాకింది. ఐటీ సర్వీసుల కంపెనీ ఫలితాలు త్రైమాసిక ప్రాతిపదికన పోల్చి చూసే సంగతి తెలిసిందే. క్యూ4లో 10 కోట్ల డాలర్లకుపైగా విలువైన కాంట్రాక్టులను పొందినట్లు కంపెనీ వెల్లడించింది. తద్వారా గత ఏడాది చివరికల్లా మొత్తం 8 పెద్ద డీల్స్‌ను కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. వాటాదారులకు షేరుకి రూ. 15.5 డివిడెండ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఎల్‌అండ్‌టీ ఇన్ఫో షేరు 7 శాతం దూసుకెళ్లి రూ. 1784 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1799 వరకూ ఎగసింది.
టాటా పవర్ కంపెనీ
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో టాటా పవర్ కంపెనీ రూ. 475 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 172 కోట్ల లాభం మాత్రమే నమోదైంది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం క్షీణించి రూ. 6621 కోట్లకు పరిమితమైంది. వాటాదారులకు షేరుకి రూ. 1.55(155 శాతం) డివిడెండ్ ప్రకటించింది. మార్పిడి రహిత బాండ్ల(ఎన్‌సీడీలు) జారీ ద్వారా రూ. 1500 కోట్లను సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం టాటా పవర్ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 34 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 35 సమీపానికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment