
న్యూఢిల్లీ: మౌలిక రంగ దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 28 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.2,020 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.2,593 కోట్లకు పెరిగిందని ఎల్ అండ్ టీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.26,846 కోట్ల నుంచి రూ.32,506 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ.24,308 కోట్ల నుంచి రూ.29,225 కోట్లకు పెరిగాయి. ఎబిటా రూ.2,962 కోట్ల నుంచి 27 శాతం వృద్ధితో రూ.3,771 కోట్లకు ఎగసిందని, నిర్వహణ మార్జిన్ 11.8 శాతానికి చేరిందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 12–15 శాతం, ఆర్డర్లు 10–12 శాతం రేంజ్‌లో పెరగగలవని కంపెనీ అంచనా వేస్తోంది.
ఆర్డర్లు 46 శాతం అప్
ఈ సెప్టెంబర్ క్వార్టర్లో గ్రూప్ కంపెనీలన్నింటి ఆర్డర్లు 46 శాతం పెరిగి రూ.41,921 కోట్లకు ఎగిశాయని ఎల్ అండ్ టీ తెలిపింది. ఈ మొత్తం ఆర్డర్లలో అంతర్జాతీయ ఆర్డర్ల వాటా 20 శాతంగా (రూ.8,268 కోట్లు) ఉందని పేర్కొంది. మౌలిక రంగ ఆర్డర్లు 69 శాతం వృద్ధితో రూ.23,406 కోట్లకు పెరిగాయి. భారీ ఇంజినీరింగ్ విభాగం రూ.1,296 కోట్ల తాజా ఆర్డర్లను చేజిక్కించుకోగా... డిఫెన్స్ ఇంజినీరింగ్ విభాగం ఆదాయం 6 శాతం తగ్గి రూ.930 కోట్లకు పరిమితమయింది. విద్యుత్తు విభాగం ఆదాయం 36 శాతం తగ్గి రూ.1,059 కోట్లకు చేరింది. ఎలక్ట్రికల్, ఆటోమేషన్ విభాగం ఆదాయం 14 శాతం పెరిగి రూ.1,403 కోట్లకు చేరింది. దివాలా చట్టం కారణంగా మొండి బకాయలు రికవరీ అవుతున్నాయని, ఇది బిజినెస్ సెంటిమెంట్‌ను మెరుగుపరిచిందని కంపెనీ తెలిపింది. కమోడిటీల ధరలు పెరగడం, రూపాయి బలహీనత, ముడి చమురు ధరల పెరుగుదల, లిక్వడిటీ సమస్యలు, తదితర సమస్యలు కారణంగా ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు సంబంధించి అప్రమత్త వాతావరణం నెలకొన్నదని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎల్ అండ్ టీ షేర్ 2.11 శాతం లాభంతో రూ.1,298 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment