లుపిన్ లాభం రూ.882 కోట్లు..
♦ అమ్మకాల జోరుతో 55 శాతం పెరిగిన నికర లాభం
♦ ఇవి అత్యుత్తమ త్రైమాసిక ఫలితాలంటున్న కంపెనీ
న్యూఢిల్లీ : ఫార్మా దిగ్గజం లుపిన్ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో 55 శాతం వృద్ధి సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో రూ.569 కోట్లుగా ఉన్న తమ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.882 కోట్లకు పెరిగిందని లుపిన్ తెలిపింది. భారత్, జపాన్ అమెరికా మార్కెట్లలో అమ్మకాలు జోరుగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని లుపిన్ ఎండీ నీలేశ్ గుప్తా చెప్పారు.
తమ కంపెనీ చరిత్రలో ఇదే అత్యుత్తమ త్రైమాసిక పనితీరు అని పేర్కొన్నారు. నికర అమ్మకాలు రూ.3,081 కోట్ల నుంచి 40 శాతం వృద్ధితో రూ.4,314 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. వ్యయాలు రూ.2,433 కోట్ల నుంచి 37 శాతం వృద్ధితో రూ.3,334 కోట్లకు పెరిగాయని తెలిపారు. ఇతర నిర్వహణ ఆదాయం 67 శాతం పెరిగి రూ.126 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. వృద్ధి జోరును కొనసాగించడానికి తగిన కృషి చేశామన్నారు.
నాట్కో ఫార్మా లాభం 70% అప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెపటైటిస్ సి, క్యాన్సర్ చికిత్సలో వాడే ఔషధాల అమ్మకాలు పెరగటంతో నాట్కో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సుమారు రూ.48 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ఆర్జించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ. 28 కోట్లతో పోలిస్తే దాదాపు 70 శాతం అధికం. ఆదాయం 45 శాతం వృద్ధితో రూ. 224 కోట్ల నుంచి రూ. 325 కోట్లకు పెరిగింది. 2016-17లో రూ. 2 ముఖవిలువ గల షేరుపై రూ. 0.75 మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని బోర్డు సమావేశంలో నిర్ణయించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కంపెనీ షేరు 1.65 శాతం క్షీణతతో రూ. 625.80 వద్ద ముగిసింది.