మళ్లీ మాసెరటి లగ్జరీ కార్లు
అందుబాటులోకి నాలుగు మోడళ్లు
- ధరలు రూ.1.14 కోట్ల నుంచి రూ.2.2 కోట్లు
- త్వరలో హైదరాబాద్‌లో డీలర్షిప్
న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ కంపెనీ మాసెరటి మళ్లీ భారత్‌లోకి ప్రవేశిస్తోంది. భారత్‌లో రూ.2.2 కోట్ల వరకూ ధరలున్న నాలుగు కార్ల మోడళ్లను అందించాలని యోచిస్తోంది. సెప్టెంబర్ కల్లా న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో డీలర్షిప్‌లను ఏర్పాటు చేస్తామని మాసెరటి హెడ్(భారత కార్యకలాపాలు) బోజాన్ జన్‌కులోవ్‌స్కీ చెప్పారు. ఆ తర్వాత హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నైలకు వీటిని విస్తరిస్తామని వివరించారు.
సీబీయూ రూపంలో దిగుమతి...
2011లో భారత్‌లోకి ప్రవేశించిన ఈ కంపెనీ డీలర్ భాగస్వామితో వచ్చిన సమస్యల కారణంగా తన కార్ల విక్రయాలను ఆపేసింది. ఇప్పుడు తాజాగా మళ్లీ భారత్‌లోకి అడుగిడుతోంది. భారత్‌లో ఎక్స్‌క్లూజివ్ లగ్జరీ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని, అందుకే భారత మార్కెట్లోకి మళ్లీ ప్రవేశిస్తున్నామని బోజాన్ పేర్కొన్నారు.
భారత్‌లో నాలుగు మోడళ్లు... క్వాట్రోపోర్టే, ఘిబ్లి, గ్రాన్‌ట్యురిజ్మో, గ్రాన్‌క్యాబ్రియో అందించాలని యోచిస్తున్నామని చెప్పారు. ఈ మోడళ్ల ధరలు రూ.1.14 కోట్ల నుంచి రూ.2.2 కోట్ల రేంజ్‌లో ఉన్నాయని వివరించారు. ఇటలీలో పూర్తిగా తయారైన కార్లను కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ల(సీబీయూ)రూపంలో భారత్‌కు దిగుమతి చేసుకొని విక్రయిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ ఎస్‌యూవీని అందుబాటులోకి తెస్తామని చెప్పారు.