విమానంలో లగ్జరీ బెడ్‌రూమ్! | Luxury wars: Etihad rolls out bed-and-bath airline suites | Sakshi
Sakshi News home page

విమానంలో లగ్జరీ బెడ్‌రూమ్!

Published Tue, May 6 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM

విమానంలో లగ్జరీ  బెడ్‌రూమ్!

విమానంలో లగ్జరీ బెడ్‌రూమ్!

దుబాయ్: ఆకాశంలో విహరిస్తూ లగ్జరీ హోటల్ సూట్‌లో సౌకర్యాలన్నీ అనుభవించే అనుభూతిని పొందాలనుకుంటున్నారా? ప్రత్యేకంగా బెడ్‌రూమ్, మీకోసమే విడిగా అటాచ్డ్ బాత్‌రూమ్‌తో పాటు మీరు చిటికేస్తే ఏదికావాలంటే అది అందించేందుకు బట్లర్(సేవకుడు)... ఇలా విమానమే మీ సొంత అపార్ట్‌మెంట్‌లా మారిపోతే! ఏంటి ఈ అతిశయోక్తులు అనేనా మీ సందేహం? నిజంగా నిజమండీ ఇవన్నీ. అబుదాబీకి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ ఈ లగ్జరీ హోటల్ తరహాలో సూట్‌లను తమ ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురానుంది. లగ్జరీని ఆకాశమేహద్దుగా తీసుకెళ్లేలా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానంగా పేరొందిన ఎయిర్‌బస్ ఏ-380లో ఈ సదుపాయాలను ఆవిష్కరించింది.

 రెండో అంతస్తులో....
 ఏ380 విమానం రెండో అంతస్తు(అప్పర్ డెక్)లో ఈ కొత్త తరహా లగ్జరీ సూట్‌ను ఎతిహాద్ ఏర్పాటు చేస్తోంది. డబుల్ బెడ్‌రూమ్, బాత్‌రూమ్, పర్సనల్ బట్లర్‌తో ప్రయాణంలో మరిచిపోలేని అనుభూతి సొంతంచేసుకునేలా చేస్తోంది. కాగా, ఏ380లో పూర్తిస్థాయిలో మొబైల్, వైఫై వినియోగించే సదుపాయం ఉంటుంది. బోయింగ్ బీ787లో వైఫై మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రపంచంలో పూర్తిస్థాయి ప్రైవేటు సూట్స్‌తో కూడిన తొలి విమాన అపార్ట్‌మెంట్స్‌ను ఏ380లో ఎతిహాద్ ఏర్పాటు చేస్తోంది. ఇందులో రిక్లైనింగ్ లాంజ్ సీట్, లగ్జరీ హోటల్‌లో ఉండే విధంగా ఫుల్‌లెంగ్త్ బెడ్, మినీ బార్, వార్డ్‌రోబ్ ఇవన్నీ ఉంటాయి.

ఇంకా అత్యాధునికమైన సౌండ్‌ను అందించే హెడ్‌సెట్, వీడియో టచ్‌స్క్రీన్‌తో కూడిన హ్యాండ్‌సెట్స్, గేమింగ్, హైడెఫినిషన్ స్క్రీన్స్ వంటి సరికొత్త సదుపాయాలనూ ఎతిహాద్ ప్రారంభించింది. కొత్త బిజినెస్, ఎకానమీ క్లాస్‌లను(ద బిజినెస్ స్టూడియో, ఎకానమీ స్మార్ట్ సీట్) ఏ380, బీ787 రెండింటిలోనూ ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. విమానంలో ప్రయాణికులకు అందించే సేవలకు సంబంధించి ఈ లగ్జరీ సూట్స్‌తో  అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పనున్నట్లు ఎతిహాద్ ఎయిర్‌వేస్ సీఈఓ జేమ్స్ హోగన్ పేర్కొన్నారు. కాగా, భారత్‌కు కూడా ఏ-380 విమానాలను నడిపేందుకు కేంద్రం ఇటీవలే అనుమతించడం తెలిసిందే. అంటే భవిష్యత్తులో భారత ప్రయాణికులకూ ఈ లగ్జరీ సేవలు అందుబాటులోకి రానున్నాయన్న మాట!
 
 జెట్-ఎతిహాద్ డీల్‌పై కొత్త సర్కారు ఎఫెక్ట్ ఉండదు
 భారత్‌లో కేంద్రంలో ప్రభుత్వం మారడం వల్ల జెట్ ఎయిర్‌వేస్‌తో తమ భాగస్వామ్యంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఎతిహాద్ ప్రెసిడెంట్, సీఈఓ జేమ్స్ హోగన్ అభిప్రాయపడ్డారు. ‘భారత్‌కు చెందిన ఒక అత్యుత్తమ కంపెనీతో మేం జట్టుకట్టాం. ఇదేమీ రాజకీయపరమైన అంశం కాదు. అందువల్ల జెట్‌లో మా పెట్టుబడుల విషయంలో ప్రభుత్వపరమైన ప్రక్రియల్లో మార్పులేవీ ఉండబోవనే సంపూర్ణ విశ్వాసం మాకుంది’ అని ఆయన పేర్కొన్నారు. జెట్-ఎతిహాద్ డీల్‌కు నియంత్రణపరంగా అనేక అడ్డంకులు ఎదురైన సంగతి తెలిసిందే. నెలల తరబడి కొనసాగిన సమీక్షల అనంతరం జెట్‌లో 24 శాతం వాటాను ఎతిహాద్ కొనుగోలు చేసేందుకు ఎట్టకేలకు ఆమోదం లభిం చింది. దీంతో దేశీ ఎయిర్‌లైన్స్‌లోకి తొలి విదేశీ ఎయిర్‌లైన్స్ పెట్టుబడిగా ఇది నిలి చింది కూడా. కాగా, ఈ డీల్ ఇరు కంపెనీలకూ ప్రయోజనకరమేనని, తాము భారతీయ విమానయాన నిబంధనలను అతిక్రమించలేదని కూడా హోగన్ స్పష్టం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement