చెట్టినాడ్ గ్రూప్‌లో కుటుంబపోరు
చెన్నై: దక్షిణాదికి చెందిన ప్రముఖ పారిశ్రామిక గ్రూప్‌ల్లో ఒకటైన చెట్టినాడ్ గ్రూప్ ఆధిపత్యానికి కుటుంబ పోరు తారాస్థాయికి చేరింది. ప్రధానంగా సిమెంటు వ్యాపారం చేసే ఈ రూ. 4,000 కోట్ల గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ ఎంఏఎం రామస్వామిని తప్పించడంలో ఆయన దత్తపుత్రుడు కృతకృత్యులయ్యారు. ఫ్లాగ్‌షిప్ కంపెనీ చెట్టినాడ్ సిమెంట్ కార్పొరేషన్ డెరైక్టర్‌గా రామస్వామిని ఎంపిక చేయకుండా పక్కన పెడుతూ బుధవారం బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందుకు వాటాదారులు సైతం అంగీకరించారు. కంపెనీల చట్టం 2013లోని 152 సెక్షన్ ప్రకారం రొటేషన్ పద్ధతిలో 82ఏళ్ల రామస్వామి పదవీ విరమణ చేసినట్లు కంపెనీ పేర్కొంది.
దీంతో డెరైక్టర్‌గా ఎంపిక చేయలేదని తెలిపింది. రామస్వామికి దత్త పుత్రుడు అయిన ఎంఏఎంఆర్ ముత్తయ్య కంపెనీకి ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చైర్మన్ ఎమిరిటస్‌గా...: రామస్వామిని తిరిగి డెరైక్టర్‌గా ఎంపిక చేయలేదని, అయితే చైర్మన్ ఎమిరిటస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారని ముత్తయ్య వాటాదారులకు వివరించారు. లోక్‌సభ మాజీ సభ్యులైన రామస్వామి గుండె సంబంధ నొప్పితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా ఏజీఎంకు హాజరుకాలేకపోయారు. కాగా, ఈ గ్రూప్ ఇటీవలే 0.8 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంగల ఆంధ్రప్రదేశ్‌లోని అంజనీ పోర్ట్‌లాండ్ సిమెంట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
సీబీఐ అరెస్ట్‌ల నేపథ్యం: రూ. 10 లక్షలు లంచం తీసుకున్న కేసులో చెన్నై రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అయిన ఎం.మను నీతి చోలన్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన ఒక రోజు తరువాత కంపెనీ ఏజీఎంలో రామస్వామిని డెరైక్టర్‌గా ఎంపిక చేయకుండా పక్కనపెట్టడంతో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కంపెనీ అజమాయిషీపై పట్టుకోసం ప్రయత్నిస్తున్న ప్రత్యర్థి వర్గానికి చెక్‌పెట్టేందుకు వీలుగా బుధవారంనాటి ఏజీఎంను రద్దు చేయమంటూ చోలన్‌కు రామస్వామి లంచం ఇవ్వజూసినట్లు సీబీఐ పేర్కొంది.
రామస్వామి స్వల్పకాలంపాటు జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ద్వారా లోకసభలో సభ్యులయ్యారు. కర్ణాటక తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అన్నామలై యూనివర్శిటీకి ప్రోచాన్సలర్‌గా వ్యవహరించారు. ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయన్న కారణంగా తమిళనాడు ప్రభుత్వం యూనివర్శిటీని చేజిక్కించుకుంది.