వాడేసిన వాహనాల ఫైనాన్స్‌పై దృష్టి | Magma plans Rs 6000 cr disbursals in asset finance in FY18 | Sakshi
Sakshi News home page

వాడేసిన వాహనాల ఫైనాన్స్‌పై దృష్టి

Published Thu, Jul 13 2017 1:26 AM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

వాడేసిన వాహనాల ఫైనాన్స్‌పై దృష్టి

వాడేసిన వాహనాల ఫైనాన్స్‌పై దృష్టి

ఈ ఏడాది రుణ లక్ష్యం 6 వేల కోట్లు
ఏపీ, తెలంగాణలో రూ. 560 కోట్లు
ట్రాక్టర్ల విభాగంలోనే ఎక్కువ ఎన్‌పీఏలు
మాగ్మా ఫిన్‌కార్ప్‌ సీఈఓ కౌశిక్‌ బెనర్జీ


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అసెట్‌ ఫైనాన్స్‌ కంపెనీ మాగ్మా ఫిన్‌కార్ప్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలో రూ.6 వేల కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్షి్యంచింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.560 కోట్లు పంపిణీ చేయనుంది. దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో అసెట్‌ ఫైనాన్స్‌లో రూ.475 కోట్ల రుణాలను మంజూరు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త కార్లు, వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్ల వంటి ఇతర విభాగాల్లో రుణాల పంపిణీ కంటే సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలు (యూజ్డ్‌ వెహికల్స్‌) విభాగంలో ఎక్కువ రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు మాగ్మా ఫిన్‌కార్ప్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ సీఈఓ కౌశిక్‌ బెనర్జీ తెలిపారు.

బుధవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ, తెలంగాణ హెడ్‌ చరణ్‌ కల్లూరితో కలిసి ఆయన మాట్లాడారు. ‘‘మేం మొత్తం మంజూరు చేస్తున్న రుణాల్లో 35 శాతం వాటా చిన్న కార్లు, 27 శాతం వాటా ట్రాక్టర్లు, 15 శాతం వాటా వాణిజ్య వాహనాలది. మిగిలిన 23 శాతం వాటా యూజ్డ్‌ వెహికల్స్‌ విభాగానిది. అయితే అన్ని విభాగాల్లో సమానమైన వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువగా వినియోగించిన వాహనాల విభాగంలో రుణాలను పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఏటా యూజ్డ్‌ వెహికిల్స్‌ విభాగం 5–10% వృద్ధిని సాధిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 45 శాతం వృద్ధిని లకి‡్ష్యంచాం’’ అని కౌశిక్‌ బెనర్జీ వివరించారు.

కొత్తగా 30 బ్రాంచీలు..
ప్రస్తుతం దేశంలో మాగ్మా ఫిన్‌కార్ప్‌కు 300 బ్రాంచీలున్నాయి. ఏపీ, తెలంగాణలో 22 బ్రాంచీలున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో మరో 30 బ్రాంచీలను ప్రారంభించనున్నట్లు కౌశిక్‌ తెలియజేశారు. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులో ఇవి రానున్నట్లు చెప్పారు. తమ మొత్తం వ్యాపారంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వాటా 11 శాతమని, గత ఆర్ధిక సంవత్సరంలో స్థూల నిరర్ధక ఆస్తులు 8.1 శాతం నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో 6.7కి తగ్గాయని తెలియజేశారు. ఎన్‌పీఏలు ఎక్కువగా ట్రాక్టర్ల విభాగంలో ఉన్నాయని, అందుకే ఆ విభాగానికి రుణాలు తగ్గించుకోవాలని భావిస్తున్నామని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement