Magma Fincorp
-
వాడేసిన వాహనాల ఫైనాన్స్‌పై దృష్టి
♦ ఈ ఏడాది రుణ లక్ష్యం 6 వేల కోట్లు ♦ ఏపీ, తెలంగాణలో రూ. 560 కోట్లు ♦ ట్రాక్టర్ల విభాగంలోనే ఎక్కువ ఎన్పీఏలు ♦ మాగ్మా ఫిన్‌కార్ప్ సీఈఓ కౌశిక్ బెనర్జీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అసెట్ ఫైనాన్స్ కంపెనీ మాగ్మా ఫిన్‌కార్ప్ ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలో రూ.6 వేల కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్షి్యంచింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.560 కోట్లు పంపిణీ చేయనుంది. దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో అసెట్ ఫైనాన్స్‌లో రూ.475 కోట్ల రుణాలను మంజూరు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త కార్లు, వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్ల వంటి ఇతర విభాగాల్లో రుణాల పంపిణీ కంటే సెకండ్ హ్యాండ్ వాహనాలు (యూజ్డ్ వెహికల్స్) విభాగంలో ఎక్కువ రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు మాగ్మా ఫిన్‌కార్ప్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ కౌశిక్ బెనర్జీ తెలిపారు. బుధవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ, తెలంగాణ హెడ్ చరణ్ కల్లూరితో కలిసి ఆయన మాట్లాడారు. ‘‘మేం మొత్తం మంజూరు చేస్తున్న రుణాల్లో 35 శాతం వాటా చిన్న కార్లు, 27 శాతం వాటా ట్రాక్టర్లు, 15 శాతం వాటా వాణిజ్య వాహనాలది. మిగిలిన 23 శాతం వాటా యూజ్డ్ వెహికల్స్ విభాగానిది. అయితే అన్ని విభాగాల్లో సమానమైన వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువగా వినియోగించిన వాహనాల విభాగంలో రుణాలను పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఏటా యూజ్డ్ వెహికిల్స్ విభాగం 5–10% వృద్ధిని సాధిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 45 శాతం వృద్ధిని లకి‡్ష్యంచాం’’ అని కౌశిక్ బెనర్జీ వివరించారు. కొత్తగా 30 బ్రాంచీలు.. ప్రస్తుతం దేశంలో మాగ్మా ఫిన్‌కార్ప్‌కు 300 బ్రాంచీలున్నాయి. ఏపీ, తెలంగాణలో 22 బ్రాంచీలున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో మరో 30 బ్రాంచీలను ప్రారంభించనున్నట్లు కౌశిక్ తెలియజేశారు. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులో ఇవి రానున్నట్లు చెప్పారు. తమ మొత్తం వ్యాపారంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వాటా 11 శాతమని, గత ఆర్ధిక సంవత్సరంలో స్థూల నిరర్ధక ఆస్తులు 8.1 శాతం నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో 6.7కి తగ్గాయని తెలియజేశారు. ఎన్పీఏలు ఎక్కువగా ట్రాక్టర్ల విభాగంలో ఉన్నాయని, అందుకే ఆ విభాగానికి రుణాలు తగ్గించుకోవాలని భావిస్తున్నామని తెలియజేశారు. -
మాగ్మా ఫిన్‌కార్ప్ నికర లాభం 22 శాతం అప్
హైదరాబాద్: మాగ్మా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 22 శాతం పెరిగి 66 కోట్లకు చేరింది. స్థూల లాభం 45 శాతం వృద్ధితో రూ.102 కోట్లకు పెరిగిందని మాగ్మా ఫిన్‌కార్ప్ ఒక ప్రకటనలో తెలిపింది. నికర వడ్డీ మార్జిన్ 109 బేసిస్ పాయింట్ల వృద్ధితో 7.5 శాతానికి చేరిందని కంపెనీ ఎండీ, వైస్ చైర్మన్ సంజయ్ ఛామ్రియా పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే,గత ఆర్థిక సంవత్సరంలో స్థూల లాభం 37 శాతం వృద్ధితో రూ.306 కోట్లకు పెరిగిందని తెలిపారు. నికర లాభం 14 శాతం వృద్ధితో రూ.214 కోట్లకు చేరిందని వివరించారు. నికర వడ్డీ మార్జిన్ 81 బేసిస్ పాయింట్లు పెరిగి 7 శాతానికి చేరిందని పేర్కొన్నారు. -
ఇంధన ఆదాపై మాగ్మా దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య వాహనాలను నడిపే డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఇంధన పొదుపుపై దృష్టిసారించినట్లు ఎన్బీఎఫ్సీ సంస్థ మాగ్మా ఫిన్‌కార్ప్ ప్రకటించింది. వచ్చే మూడేళ్ళ కాలంలో డ్రైవింగ్‌లో నైపుణ్యం పెంచడం ద్వారా 35 లక్షల లీటర్ల ఇంధనాన్ని ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మాగ్మా ఫిన్‌కార్ప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సందీప్ వలున్జ్ తెలిపారు. దేశంలో 50 లక్షల మంది ట్రక్ డ్రైవర్లు ఉన్నారని, వీరిలో ఏడాదికి లక్ష మంది డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్‌తో ఒప్పందం చేసుకున్నామని, ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ట్రాఫిక్ ట్రాన్స్పోర్ట్ నగర్లు పేరుతో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సందీప్ తెలిపారు. వచ్చే ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 13 కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకున్నామని, తొలి కేంద్రాన్ని కరీంనగర్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే విజయవాడతో పాటు మరో 12 చోట్ల ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ వివరాలను తెలియచేయడానికి సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సందీప్ మాట్లాడారు. ఈ ఏడాది లక్ష మంది డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా సుమారు 7.65 లక్షల లీటర్ల ఇంధనాన్ని ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కంపెనీ సామాజిక సేవలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, డ్రైవర్లకు శిక్షణసహా, ఆరోగ్యంపై అవగాహనపైనా దృష్టి పెడుతున్నామన్నారు.