మహింద్రా లాభం రూ. 725 కోట్లు
షేరుకు డివిడెండు రూ.13
ముంబై: ఆటోమొబైల్ దిగ్గజం మహింద్రా అండ్ మహింద్రా నికరలాభం 2017 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 20 శాతం వృద్ధితో రూ. 725 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ నికరలాభం రూ. 605 కోట్లు. ముగిసిన త్రైమాసికంలో ఆదాయం 4 శాతం వృద్ధితో రూ. 11,840 కోట్ల నుంచి రూ. 12,320 కోట్లకు పెరిగినట్లు కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలిపింది. నాల్గవ త్రైమాసికంలో తమ వాహన విక్రయాలు ఫ్లాట్‌గా వున్నాయని, 1,30,778 యూనిట్లు విక్రయించినట్లు మహింద్రా పేర్కొంది.
2016–17 పూర్తి ఆర్థిక సంవత్సరంలో స్టాండెలోన్ ప్రాతిపదికన నికరలాభం 13 శాతం వృద్ధితో రూ. 3,204 కోట్ల నుంచి రూ. 3,965 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 44,489 కోట్ల నుంచి రూ. 48,439 కోట్లకు పెరిగింది. మంగళవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ. 13 చొప్పున డివిడెండు సిఫార్సుచేసింది. ఫలితాల నేపథ్యంలో మహింద్రా షేరు స్వల్ప పెరుగుదలతో రూ. 1,362 వద్ద ముగిసింది.
ఈ ఏడాది బావుంటుంది...
దేశీయ, అంతర్జాతీయ సానుకూల మార్కెట్ల కారణంగా 2017–18 ఆర్థిక సంవత్సరం గతేడాదితో పోలిస్తే ప్రోత్సాహకరంగా వుంటుందని మహింద్రా అంచనాల్లో పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న రీమోనిటైజేషన్ ప్రక్రియకు తోడు బ్యాంకుల రుణ వడ్డీ రేట్లు తగ్గుతున్న కారణంగా అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. యుటిలిటీ వాహన విభాగంలో మార్కెట్ వాటా పెంచుకోవడంపై దృష్టినిలిపినట్లు మహింద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయింకా చెప్పారు. ఈ విభాగంలో ఒక కొత్త బ్రాండ్‌తో మోడల్‌ను ప్రవేశపెడతామని, కొన్ని ప్రస్తుత మోడల్స్‌లో మార్పుచేర్పులు చేసి విడుదల చేస్తామని ఆయన వివరించారు.