మార్చి 31కి ముందే భారీ డిజిన్వెస్ట్‌మెంట్ : జైట్లీ
ముంబై: కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి ముందే(మార్చి 31) పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణల (డిజిన్వెస్ట్‌మెంట్) కార్యక్రమాన్ని చేపడుతుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. అయితే ఇంతకుమించి తాను దీనిపై మరే ఇతర అంశాలూ చెప్పదలచుకోలేదన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4.1 శాతం వద్ద ద్రవ్యలోటు (కేంద్రానికి రాబడి-వ్యయాల మధ్య వ్యత్యాసం) కట్టడికి కేంద్రం కట్టుబడి ఉందని కూడా స్పష్టం చేశారు.
ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న జైట్లీ ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.43,425 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణలు బడ్జెట్ లక్ష్యం. ఇందుకోసం ఓఎన్‌జీసీ, ఎన్‌హెచ్‌పీసీ, కోల్ ఇండియా వంటి సంస్థలు వరుసలో ఉన్నాయి.
ఆర్థికవృద్ధిపై ఇలా...
గడచిన సంవత్సరాలతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థికాభివృద్ధి బాగుండే అవకాశం ఉన్నప్పటికీ, ఇది పూర్తి సంతృప్తికలిగించకపోవచ్చన్నారు. దీనికి గత ప్రభుత్వం చేసిన పొరపాట్లే కారణమని విమర్శించారు. ద్రవ్యోల్బణం పూర్తి అదుపులో ఉంటుందంటూ, ఇది వడ్డీరేట్ల తగ్గింపునకు, వృద్ధికి దోహదపడుతుందన్నారు.