సాక్షి, న్యూఢిల్లీ : 156 బిలియన్ డాలర్ల ఐటీ ఇండస్ట్రి ఇంకా పరిస్థితులు మారడం లేదు. ఉద్యోగాల సృష్టికి అతిపెద్ద పరిశ్రమగా ఉండే ఈ ఐటీ రంగం, గత కొన్నాళ్లుగా కొట్టుమిట్టాడుతూనే ఉంది. కొత్త నియామకాలు లేకపోవడం, పాత ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం జరుగుతూ వస్తోంది. ప్రస్తుతం టాప్ టెక్ దిగ్గజాలన్నీ తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేసుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహింద్రా కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను బాగా తగ్గించేసుకున్నాయి. కాగ్నిజెంట్‌లో ఈ సంఖ్య బాగా పడిపోయింది. టాప్-6 ఐటీ కంపెనీల్లో కేవలం టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాత్రమే తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో ఆరు టెక్ కంపెనీల ఉద్యోగుల సంఖ్యలో 4,157 మంది తగ్గిపోయారు. గతేడాది ఇదే సమయంలో ఈ కంపెనీల్లో 60వేల మేర ఉద్యోగాలు పెరిగితే, ఈ ఏడాది మాత్రం 4,157 మేర ఉద్యోగాలు పడిపోయాయి.
డిజిటలైజేషన్, ఆటోమేషన్ అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ, కొన్ని సవాళ్లను కూడా ఐటీ ఇండస్ట్రి ఎదుర్కొంటుందని విశ్లేషకులు చెప్పారు. కేవలం నియామకాలు పడిపోవడమే కాకుండా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం చూస్తున్నామని ఐటీ కన్సల్టింగ్ సంస్థ హెచ్‌ఎఫ్‌సీ రీసెర్చ్ తెలిపింది. ఆటోమేషన్ ప్రభావంతో రెడండెంట్‌గా ఉన్న వేల కొద్దీ ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలను కంపెనీలు తీసేస్తున్నాయని పేర్కొంది.. అధిక వినియోగం, ఉత్పాదకత మెరుగుదలతో తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించామని ఇన్ఫోసిస్ సీఎఫ్‌ఓ ఎండీ రంగనాథ్ చెప్పారు. ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు రీ-ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment