
మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి
నిబంధనల సడలింపు, వృద్ధి.. ఇన్వెస్టర్ల అనుకూల విధానాలతో 2014-16లో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు.
ఫిన్లాండ్ వ్యాపార దిగ్గజాలకు రాష్ట్రపతి ఆహ్వానం
హెల్సింకి, ఫిన్లాండ్: నిబంధనల సడలింపు, వృద్ధి.. ఇన్వెస్టర్ల అనుకూల విధానాలతో 2014-16లో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇన్‌ఫ్రా, తయారీ తదితర రంగాల్లో ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఫిన్లాండ్ కార్పొరేట్లను ఆహ్వానించారు. ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా వ్యాపార దిగ్గజాలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
మిగతా దేశాలతో పోలిస్తే అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని దీటుగా ఎదుర్కొని భారత్.. భారీ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని రాష్ట్రపతి చెప్పారు. ఇన్‌ఫ్రా రంగానికి ఊతమివ్వడం, స్థూల ఆర్థిక పరిస్థితులను పటిష్టపర్చుకోవడం, ఇన్వెస్టర్లను ఆకర్షించడం తదితర చర్యలతో భారత్ మళ్లీ ఏడు-ఎనిమిది శాతం వృద్ధి బాట పట్టగలదని ప్రణబ్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, ప్రస్తుతం 1.5 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం మరింతగా పెరగాలని ప్రణబ్ ఆకాంక్షించారు. విద్య, టూరిజం తదితర రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని చెప్పారు. అంతకు ముందు ఫిన్లాండ్ పార్లమెంట్‌లో ప్రణబ్ ప్రసంగించారు. ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వ ప్రతిపాదన కు మద్దతు ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.