
అకస్మాత్తుగా డబ్బు వస్తే.. అప్పు తీరుస్తారా... పెట్టుబడి పెడతారా?
- అప్పటికే మీకు కొంత అప్పుంది. అయితే అదే సమయంలో మీ దగ్గరకు కొంత డబ్బు వచ్చింది? మరి ఉన్న అప్పును ఇప్పుడు తీర్చేస్తే మంచిదా? లేక అప్పు కన్నా అధిక వడ్డీ వచ్చే ప్రొడక్ట్ ఏదైనా ఉంటే- అందులో ఇన్వెస్ట్ చేయడం మంచిదా...?
- మీరు బ్యాంకులో కొంత డబ్బు డిపాజిట్ చేశారు. వడ్డీ 8 శాతం. ఇదే సమయంలో కారు లోను తీసుకున్నారు. 11 శాతం వడ్డీ పడుతోంది. మరి 8 శాతం వడ్డీ వస్తున్న బ్యాంక్ డిపాజిట్‌ను అలానే ఉంచి, 11 శాతం కారులోను తీసుకోవడం వల్ల ఆర్థికంగా ప్రయోజనం ఏదన్నా ఉంటుందా?
ఇలాంటి సందేహాలకు సమాధానం చాలా కష్టం. అయితే ఆచితూచి తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థికంగా దీర్ఘకాలంలో అధిక ప్రయోజనాలు
కలుగుతాయి. వచ్చిన డబ్బును ప్రణాళిక ప్రకారం ఖర్చుపెట్టుకోకపోతే చివరకు అది ‘అప్పు’ అనే పదం వైపు దారితీయక తప్పదు. అందుకే ఆర్థిక సమస్యల్లో చిక్కుకోకుండా ఉండాలంటే పక్కా ప్రణాళిక కావాలి. ఒకఅప్పు కొనసాగుతున్నప్పుడు మరో అప్పు తీసుకోవడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఆర్థిక చెల్లింపుల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. అప్పు తీసుకునేందుకు పరిశీలించాల్సిన అంశాలు...
చెల్లింపుల వ్యూహం...
రుణ చెల్లింపుల వ్యూహం కూడా వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల్లో ముఖ్యమైనదే. ఉదాహరణకు మీరు రూ.20,00,000 గృహ రుణం తీసుకున్నారనుకుందాం. వడ్డీరేటు 10.50 శాతం. కాలపరిమితి పదేళ్లు అనుకుందాం. అంటే 10 ఏళ్ల పాటు నెలవారీగా రూ.26,987 చెల్లించాలి. ఇక్కడ వడ్డీ మొత్తమే దాదాపు రూ. 12,38,440. రుణ చెల్లింపులు ప్రారంభమైన రెండేళ్ల తరువాత మీ వద్ద రూ.2,00,000 మిగులు ఉందనుకుందాం. దీనిని రుణంలో భాగంగా ముందస్తు చెల్లింపు చేస్తే... మీ వడ్డీపై కాల పరిమితి మొత్తంపై దాదాపు రూ.2,32,000 పొదుపు చేసుకోగలుగుతారు.
ఈ సందర్భంలో మీరు పన్ను మినహాయింపులకు అర్హమైన సొమ్మును కొంత కోల్పోతారు. ఒకవేళ మిగులు రూ.2,00,000ను ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే- పదేళ్ల కాలంలో వార్షికంగా 10 నుంచి 12 శాతం వడ్డీచొప్పున రూ.3,20,000 సొమ్ము మీకు అందుబాటులోకి వస్తుంది. అయితే ఇక్కడ రిటర్న్స్ గ్యారెంటీ కాదు. రిస్క్ సామర్థ్యం ఉండాలి. ఈ సామర్థ్యం ఉంటే... రూ.2,00,000 గృహ రుణం కింద చెల్లించేయకుండా... ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడమే బెటర్. ఇలాంటి చెల్లింపు వ్యూహాలు ఆర్థిక ప్రయోజనాన్ని సమకూర్చుతాయి. ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ఇవన్నీ భాగాలే అన్న విషయాన్ని గుర్తించాలి.
అప్పుల జాబితా తయారీ!
మీకు ప్రస్తుతం అప్పులు ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎంత? వడ్డీ ఎంత? ఎప్పటికల్లా రుణం తీర్చాలి? వంటి అంశాలన్నింటినీ ఒక పేపర్ మీద రాసుకోవాలి. పన్ను మినహాయింపు ఉన్న రుణాల గురించి కూడా వివరాలు రాయాలి. ఉదాహరణకు మీకు, మీ భార్యకు లేదా పిల్లలకు విద్యా రుణం తీసుకున్నారనుకుందాం! దీనిపై చెల్లించే వడ్డీకి పన్ను మినహాయింపు లభిస్తుంది. గృహ రుణానికి సంబంధించి అసలు, వడ్డీపై కూడా పన్ను ప్రయోజనం ఉంటుంది. ఆయా అంశాలన్నింటినీ ఒక కాగితంపై ఉంచుకుని ‘అప్పు భారాన్ని’ అర్ధం చేసుకోవాలి. దీనికి అనుగుణంగా తాజా రుణం.. ఇన్వెస్ట్‌మెంట్ వంటి అంశాలపై అంచనాకు రావాలి.
తక్షణ అవసరాలు...
నెలవారీగా తద్వారా వార్షికంగా మీ జీవన అవసరాలను లెక్కలోకి తీసుకోండి. నెలవారీ ఆహార ఖర్చులు, పిల్లల చదువులు.. అద్దెలు, వినోదం, బీమా వంటి అవసరాలకు చెల్లింపుల అంశాలను పేపర్‌పై ఉంచండి.
అందుబాటులో ఉన్న సొమ్ము ఎంత?
ఇప్పుడు మీ దగ్గర అందుబాటులో ఉన్న సొమ్మును పరిగణనలోకి తీసుకోండి. ఇందులో అత్యవసరాలకు ఎంత మొత్తం అవసరమో నిర్ణయించుకోండి. అత్యవసర ఆరోగ్య సమస్యలు, ప్రైవేటు రంగంలో ఉద్యోగం కోల్పోయే బెడద వంటివి ఎన్నో ఉంటాయి. మీ కుటుంబ అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా నెలకు ఎంత ఖర్చవుతుందో అంతకు మూడు నుంచి ఆరు రెట్లు అధిక మొత్తం మీ దగ్గర ఉండడం శ్రేయస్కరం. నెలవారీ మిగులు విభాగం ఒకటి నిర్వహించడం మంచిది. అత్యవసర నిధికి అవసరమైతే ఈ విభాగం నుంచి డబ్బు సమకూరాలి.