భవిష్యత్తు అవసరాలను గుర్తించిన బడ్జెట్
10కి 7.5 మార్కులు ఇచ్చిన సీఐఐ-తెలంగాణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం యక్క భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సాధారణ బడ్టెట్‌ను రూపొందించినట్లుందని సీఐఐ తెలంగాణ అభిప్రాయపడింది. పన్ను విధానం స్పష్టంగా పెట్టుబడుల్ని ఆకర్షించేలా ఉందన్నారు. యువత, రైతులు, సామాన్య, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికి బాటలు వేసేలే ఈ బడ్జెట్ ఉందని కొనియాడారు. గృహ విద్య, వైద్య, ఆరోగ్య, ఉద్యోగ రంగాలపై 2022 నాటికి లక్ష్యాన్ని ఏర్పాటు చేసి వాటిని చేరుకునేందుకు చర్యలు చేప్టటడం అభినందనీయమన్నారు.
7.5 శాతంగా ఉన్న స్థూలదేశీయోత్పత్తిని 8-8.5 శాతం పెంచడమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించారన్నారు. అనంతరం ఈ బడ్జెట్‌కు 10కిగాను 7.5 మార్కులిస్తున్నట్లు సీఐఐ తెలంగాణ చైర్ పర్సన్ వనితాదాట్ల శనివారమిక్కడ మీడియాకు తెలిపారు. మేక్ ఇన్ ఇండియాకు ఊతమిచ్చేలా, యువతను, యువ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేలా బడ్జెట్ ఉందన్నారు. పెద్ద కంపెనీలతో సమానంగా పోటీపడుతున్న స్టార్టప్స్‌లను ప్రోత్సహించేందుకు ప్రత్యేకించి రూ.1,000 కోట్లు కేటాయించడం ఇందుకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. ‘‘దేశంలోని మహిళ రక్షణకు ప్రత్యేకించి నిర్భయ ఫండ్ కింద రూ.1,000 కోట్లు కేటాయించడం ఆహ్వానించదగ్గ పరిణామమని’’ మాలక్ష్మి ఇన్‌ఫ్రా వెంచర్స్ ప్రై.లి. ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ తేజస్విని యార్లగడ్డ అభిప్రాయడ్డారు.
అయితే మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేలా లోతైన స్థాయిలో అధ్యయనం చేసి మరిన్ని నిధులను కేటాయించి ఉండాల్సిందన్నారు. ‘‘ప్రత్యేక కేటాయింపులు, రాయితీలు ఉంటాయని ఈ బడ్జెట్‌పై ఎంతగానో ఆశపెట్టుకున్న నిర్మాణ రంగాన్ని మాత్రం విస్మయానికి గురిచేసిందని’’ శ్రీశక్తి రిసార్ట్స్ అండ్ హోటల్స్ లి. సీఎండీ డీవీ మనోహర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో నిధుల కేటాయింపు గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం శోచనీయమని చెప్పారు. డిఫెన్స్ విభాగానికి ఇచ్చిన ప్రాధాన్యం విద్య, వైద్య రంగాలకు ఇవ్వలేదని విమర్శించారు. రహదారులు, గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం రూ.25 వేల కోట్లు కేటాయించడం చూస్తే మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం చిత్తశుద్ది కనబడుతోందన్నారు.