ఫలితాలు నడిపిస్తాయ్‌...! | Market-affected items in brief | Sakshi
Sakshi News home page

ఫలితాలు నడిపిస్తాయ్‌...!

Published Mon, Jul 16 2018 1:49 AM | Last Updated on Mon, Jul 16 2018 10:45 AM

Market-affected items in brief  - Sakshi

కార్పొరేట్‌ కంపెనీల క్యూ1 ఫలితాలతో పాటు ప్రపంచ పరిణామాలు ఈ వారం మన  స్టాక్‌ మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వారంలో హిందుస్తాన్‌ యూనిలీవర్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, విప్రో, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌  వంటి బ్లూ చిప్‌ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు,  డాలర్‌తో రూపాయి మారకం, ద్రవ్యల్బోణ గణాంకాలు ఈ వారం మార్కెట్‌కు కీలకాంశాలని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.  

నేడు టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు...
నేడు(సోమవారం) జూన్‌ నెల టోకు ధరల ద్రవ్యోల్బణం గణాంకాలు వస్తాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 3.18 శాతంగా ఉన్న ఈ ద్రవ్యోల్బణం ఈ ఏడాది మేలో 4.43 శాతానికి పెరిగింది. నేడు హిందుస్తాన్‌ యూనిలివర్‌ క్యూ1 ఫలితాలు వెలువడతాయి. ఈ నెల 17న(మంగళవారం) అశోక్‌ లేలాండ్, ఫెడరల్‌ బ్యాంక్, జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్, ఈ నెల 18న అల్ట్రాటెక్‌ సిమెంట్, బంధన్‌ బ్యాంక్, ఆర్‌కామ్‌ క్యూ1 ఫలితాలు వస్తాయి.

ఈ నెల 19న(గురువారం) కోటక్‌ మహీంద్రా బ్యాంక్, బజాజ్‌ ఫైనాన్స్, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఫలితాలు, ఈ నెల 20న(శుక్రవారం) విప్రో, బజాజ్‌ ఆటో, ఈ నెల 21న(శుక్రవారం) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్‌ పవర్‌ కంపెనీల క్యూ1 ఫలితాలు వెలువడతాయి. ఫలితాలు సాదాసీదాగా ఉన్నప్పటికీ, ఆశ్చర్యకరంగా బోనస్‌ను ప్రకటించడంతో ఇన్ఫోసిస్‌ షేర్‌పై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుందని నిపుణులంటున్నారు.  

ఫలితాలపైనే దృష్టి...
కంపెనీల ఫలితాలపైననే ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుందని కోటక్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌(రీసెర్చ్‌) సంజీవ్‌ జర్బాడే పేర్కొన్నారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలున్నాయని అంతర్జాతీయంగా ఆశాభావం వ్యక్తమవుతోందని వివరించారు. ముడి చమురు ధరలు ఒకింత తగ్గాయని, మరింతగా తగ్గితే ప్రపంచ మార్కెట్లకు సానుకూలమని వివరించారు.  ఫలితాల సీజన్‌ ఆరంభమైందని, మార్కెట్‌ వేచి చూసే ధోరణిలో ఉందని శామ్‌కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోదీ చెప్పారు. ముడి చమురు ధరలు చల్లబడటం, బాండ్‌ ఈల్డ్‌లు తగ్గడం మార్కెట్‌ స్థిరత్వానికి సూచనలని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ వ్యాఖ్యానించారు.

టీసీఎన్‌ఎస్‌ క్లోథింగ్‌ ఐపీఓ  
టీసీఎన్‌ఎస్‌ క్లోధింగ్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ) ఈ నెల 18(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 20న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,125 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ప్రైస్‌బ్యాండ్‌ రూ.714–716గా ఉంది. కనీసం 20 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

కొనసాగుతున్న ‘విదేశీ’ అమ్మకాలు  
మన క్యాపిటల్‌ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నెల మొదటి రెండు వారాల్లో మన డెట్‌ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,200 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.

అమెరికాలో ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్లను పెంచే అవకాశాలుండటం, ఈ నెల మొదటివారంలో ముడి చమురు ధరలు పెరగడం వల్ల డెట్‌ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారని నిపుణులంటున్నారు.  అయితే స్టాక్స్‌లో మాత్రం నికర కొనుగోళ్లు జరిపారు. ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ.592 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ మధ్య  రూ.20,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement