
మరికొన్ని రోజుల్లో... అంటే ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం 2018–19 ప్రారంభం కానుంది. ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది బాగానే ర్యాలీ చేసినా... తరువాత కొంత తగ్గాయి. మొత్తమ్మీద చూస్తే గతేడాది లాభదాయకమేనని చెప్పాలి. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో రాబడులు ఏ మేరకున్నాయి, పోర్టుఫోలియోలో మార్పులు అవసరమా... లేదా? తదితర అంశాలపై ఓ సారి దృష్టి సారించడం ద్వారా వాటిల్లో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశముంటుంది. ఈక్విటీల్లో రాబడులకు తగ్గట్టుగా పెట్టుబడుల కేటాయింపుల్లో మార్పుచేర్పులు చేయడం తప్పనిసరి. దీనివల్ల మీ పోర్టుఫోలియోకు రిస్క్‌ను తట్టుకునే సామర్థ్యం వస్తుంది. ఇందుకు ఏం చేయాలనేదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం...
మార్కెట్ల ర్యాలీతో ఫండ్స్ ఆకర్షణీయం...
మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇటీవలి కాలంలో సాధారణ ఇన్వెస్టర్లలోనూ ఆసక్తి పెరిగింది. మ్యూచుల్ ఫండ్స్ పథకాల్లోకి పెట్టుబడుల రాక పెరగడమే ఇందుకు నిదర్శనం. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో 2016 ఏప్రిల్‌లో రూ.3,122 కోట్లు ఫండ్స్ పథకాల్లోకి రాగా, 2017 ఏప్రిల్ నెలకొచ్చేసరికి ఇవి కాస్తా రూ.4,300 కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది జనవరి నెలలో సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఏకంగా రూ.6,644 కోట్ల నిధులు వచ్చి పడ్డాయి. ఇన్వెస్టర్ల ఫోలియోల సంఖ్యలోనూ భారీ వృద్ధి కనిపిస్తోంది. 2015 డిసెంబర్‌లో సుమారు 3.8 కోట్ల ఫోలియోలు ఉండగా, 2017 డిసెంబర్ నాటికి ఇవి 4.8 కోట్లకు చేరాయి. ఇక మ్యూచువల్ ఫండ్స్‌లో అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల (హెచ్‌ఎన్‌ఐ) సంఖ్యలోనూ పెరుగుదల కనిపిస్తోంది. 2015 డిసెంబర్‌లో 8,60,000 మంది హెచ్‌ఎన్‌ఐలు ఉండగా, 2017డిసెంబర్ నాటికి 17 లక్షలకు చేరారు. అంటే దాదాపు రెట్టింపయ్యారు. ఒక ఇన్వెస్టర్ పెట్టుబడులకు సంబంధించి కేటాయించే సంఖ్యే ఫోలియో నంబర్. ఒకటికి మించిన ఫండ్స్ సంస్థల్లో పెట్టుబడులుంటే ఒకే ఇన్వెస్టర్‌కు ఒకటికి మించి ఫోలియోలుంటాయి.
అసెట్ అలొకేషన్‌ను సమీక్షించాలి...
ఫండ్స్‌లోకి ఈ స్థాయిలో పెట్టుబడులు రావటానికి ఈక్విటీ మార్కెట్ల ర్యాలీయే ప్రధాన ఇంధనమని చెప్పుకోవాలి. 2017లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 28 శాతం, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 48 శాతం, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 60 శాతం చొప్పున పెరిగాయి. వాస్తవానికి ఇలా మార్కెట్లు పెరుగుతున్న కొద్దీ, పెట్టుబడులపై రాబడులు అధికం అవుతుంటాయి. అంటే ఆ మేరకు ఇన్వెస్టర్లు ఎక్స్‌పోజర్‌ను తగ్గించుకోవాలి. దీన్నే పోర్ట్ ఫోలియో రీబ్యాలన్స్‌గా చెబుతారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ నేపథ్యంలో అసెట్ అలోకేషన్‌ను (పెట్టుబడుల కేటాయింపులు) ఓ సారి సమీక్షించుకోవాలనేది నిపుణుల సూచన. ‘‘గడిచిన రెండేళ్లలో భారత ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేశాయి. ఇన్వెస్టర్ల పెట్టుబడి విలువ గణనీయంగా పెరిగింది. దీనర్థం ఈక్విటీలు బాగా ఖరీదయ్యాయి. అమెరికా, యూరోప్, జపాన్‌లో బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి. దీంతో అక్కడ వడ్డీ రేట్లు పెరుగుతాయి’’ అంటూ క్రెడిట్ సూసీ వెల్త్ మేనేజిమెంట్ ఇండియా ఫండ్స్ హెడ్ కునాల్ వాలియా కొన్ని సూచనలు చేశారు. అవి...
►ఈక్విటీల్లో అధిక పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది.
► మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడులు తగ్గించుకోవాలి
►డెట్ ఫండ్స్‌లో రాబడులు పెరుగుతున్నందున కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు.
లక్ష్యాలకు తగ్గ బడ్జెట్
మీ దగ్గర సమగ్రమైన ఆర్థిక ప్రణాళిక ఉంటే చాలదు. ఎందుకంటే కొత్త లక్ష్యాలు మీ ముందుకు రావచ్చు. అప్పటికే కొన్ని లక్ష్యాలను దాటిపోవచ్చు. కొత్తగా రుణాలు తీసుకుని ఉండొచ్చు. వీటన్నింటికీ బడ్జెట్‌లో చోటు కల్పించాలి. ఈ విషయమై మ్యాక్స్ ఫైనాన్షియల్ ప్లానర్స్ వ్యవస్థాపకుడు ప్రకాశ్ ప్రహరాజ్ మాట్లాడుతూ... ఓ క్లయింట్ అనుభవాన్ని తెలియజేశారు. ‘‘ఓ వ్యక్తి తన కుమారుడి విదేశీ చదువుల కోసం రూ.25 లక్షల విద్యా రుణం తీసుకున్నాడు. విదేశీ యూనివర్సిటీకి తొలి ఏడాదే అన్ని ఫీజులు కట్టాలి కదా!! దాంతో రుణాన్ని నాలుగు వాయిదాలుగా మొదటి ఏడాదిలోనే త్రైమాసికోసారి ఇచ్చేందుకు బ్యాంకు అంగీకరించింది. రెండు వాయిదాలిచ్చాక కొర్రీ వేసింది. తిరిగి ఐదో ఏడాదిలోనే ఇస్తానని స్పష్టం చేసింది. బ్యాంకు ఇంటర్నల్ ఆడిట్ బృందం అభ్యంతరాలతో అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. దీన్ని అతడు ఊహించలేదు. దీంతో అతడి అంచనాలు తప్పాయి. తన సొంత నిధుల నుంచి సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. అతడు తన పోర్ట్‌ఫోలియో, పెట్టుడులను సమీక్షించుకోవాల్సి వచ్చిం ది’’ అని ప్రకాశ్ ప్రహరాజ్ తెలిపారు. ఈ పరిస్థితితో సదరు వ్యక్తి తన కుమారుడి విదేశీ విద్యా ఫీజులు కట్టేందుకు తన రిటైర్మెంట్ నిధి నుంచి, తన కుమార్తె వివాహ అవసరాల కోసం ఏర్పాటు చేస్తున్న నిధి నుంచి సర్దుబాటు చేసుకున్నారని ప్రకాశ్ చెప్పారు.
కేటాయింపులు మారాలి...
ఇక ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులకు సాధారణంగా వేతన పెంపు ఉంటుంది. అయినప్పటికీ చాలా మంది తమ పెట్టుబడుల్లో మార్పులకు చొరవ తీసుకోరు. దీంతో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా పెట్టుబడుల మొత్తం వృద్ధి ఉండదు. అందుకే ఏటా వేతనం పెంపు స్థాయిలో పెట్టుబడులను కూడా పెంచుకోవాలని ప్రహరాజ్ సూచించారు. సిప్ రూపంలో పెట్టుబడుల మొత్తాన్ని పెంచుకోవచ్చన్నారు.
నామినేషన్, విల్లు
చాలా మంది చేసే తప్పు నామినేషన్‌ను పట్టించుకోకపోవడం లేదా నిర్లక్ష్యం వహించడం. కానీ, ప్రతీ పెట్టుబడి సాధనానికి నామినేషన్ ఇవ్వడం ఎంతో అవసరమైనదనేది ఆర్థిక నిపుణుల సూచన. పెట్టుబడి పెట్టే వ్యక్తికి అనుకోనిది ఏదైనా జరిగితే వారి పేరిట ఉన్న పెట్టుబడులు సరైన వారి చేతికి, జాప్యం లేకుండా సకాలంలో అందుతాయి. ఇందుకు విల్లు రాయడం కూడా మంచి ఆలోచనే. కోరుకున్న విధంగా పెట్టుబడులు, ఆస్తులు సరైన వారి చేతికి చేరేందుకు విల్లు వీలు కల్పిస్తుంది. ఒకరికి మించి పంపకం జరగాలని ఆశించినా ఆ మేరకు విల్లు రాసుకోవచ్చు. నామినేషన్ అన్నది ట్రస్టీలాంటిది. నామినీ అంటే వారసులే కావాలని లేదు. ఒకవేళ నామినీగా వారసుల్లో ఒకరి పేరును చేర్చినప్పటికీ మీ తదనంతరం వారికి బదిలీ అయిన ఆస్తులను వారుసులందరికీ సమానంగా పంపిణీ చేయాల్సిన బాధ్యత నామినీపై ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment