పరిమిత శ్రేణిలో కదలికలు
స్వల్పంగా పెరిగిన సూచీలు
ముంబై: ప్రపంచ మార్కెట్లు మందకొడిగా ట్రేడయిన నేపథ్యంలో బుధవారం దేశీయ సూచీలు పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగడంతో స్వల్పలాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 31,285–31,178 పాయింట్ల మధ్య కేవలం 100 పాయింట్ల శ్రేణిలో కదిలి, చివరకు 36 పాయింట్ల పెరుగుదలతో 31,256 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రోజంతా కీలకమైన 9,600 పాయింట్లపైన ట్రేడయిన అనంతరం చివరకు 24 పాయింట్ల లాభంతో 9,637 పాయింట్ల వద్ద ముగిసింది.
సమీప భవిష్యత్తులో మార్కెట్ బాగుంటుందన్న అంచనాలతో అధిక షేర్లు పెరిగాయని, అయితే జీఎస్‌టీ అమలుతో కార్పొరేట్ లాభాలు తగ్గుతాయన్న భావనతో భారీ కొనుగోళ్లు జరగడం లేదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. దేశంలో సర్వీసుల రంగం కార్యకలాపాలు 8 నెలల గరిష్టస్థాయికి చేరినట్లు నికాయ్ పీఎంఐ డేటా వెలువడినప్పటికీ, మార్కెట్ డల్‌గా ముగిసిందని, దక్షిణ కొరియా క్షిపణిని ప్రయోగించడంతో తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతల దృష్ట్యా మార్కెట్ ఫ్లాట్‌గా ముగిసిందని బీఎన్‌పీ పారిబా సీనియర్ ఫండ్ మేనేజర్ లక్ష్మణన్ విశ్లేషించారు.
లుపిన్ టాప్...
అమెరికా మార్కెట్లో కొత్త ఔషధాన్ని ప్రవేశపెట్టినట్లు ఫార్మా కంపెనీ లుపిన్ ప్రకటించడంతో ఈ షేరు 3.82 శాతం ర్యాలీ జరిపింది. సెన్సెక్స్–30 షేర్లలో అధికంగా పెరిగిన షేరు ఇదే. మరో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ 1 శాతం పెరిగింది. మహీంద్రా 2.24 శాతం, ఓఎన్‌జీసీ 1.69 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.58 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.20 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.09 శాతం చొప్పున ఎగిశాయి. మరోవైపు ఐటీసీ 1.79 శాతం పడిపోయింది. ఇన్ఫోసిస్, విప్రోలు స్వల్పంగా తగ్గాయి.