నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 27,811.84 పాయింట్ల వద్ద, నిఫ్టీ 8,382 పాయింట్ల వద్ద ముగిశాయి. గ్రీక్ సంక్షోభ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై గట్టిగానే కనపడుతోంది. బ్యాంకు షేర్లు పడిపోవడంతో సెన్సెక్స్ నష్టాల్లోనే ముగిసింది. ఈ వారంలో మార్కెట్లకు చివరి రోజైన శుక్రవారం మిడ్ సెషన్ నుంచి మార్కెట్లు పడిపోవడం కనిపించింది. మిడ్ సెషన్లోనే సెన్సెక్స్ 80 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ కూడా మధ్యాహ్నం సెషన్లో 17.50 పాయింట్లు పడిపోయింది. 27,880.72 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్.. చివరకు 84.13 పాయింట్లు నష్టపోయి 27811.84 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 16 పాయింట్లు నష్టపోయి, 8,382 వద్ద ముగిసింది.
రూ. 48 వేల కోట్లతో దేశంలో 100 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తామన్న ప్రధాని ప్రకటనతో మార్కెట్ల ప్రారంభ సమయంలో కొంత పాజిటివ్ లక్షణాలు కనిపించినా.. గ్రీక్ సంక్షోభం దాన్ని అధిగమించి మార్కెట్లను నష్టాల్లోకి నెట్టేసింది. ఐటీ, వినియోగదారుల వస్తువులు, ఆటోమొబైల్, టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్, మీడియా, ఆరోగ్య రంగాల షేర్లు కొంత లాభాలు పొందాయి. అయితే బ్యాంకులు, కేపిటల్ గూడ్స్, మెటల్, ఆయిల్, గ్యాస్, విద్యుత్ రంగ షేర్లు మాత్రం బాగా ఒత్తిడికి గురయ్యాయి.