
మెహసానా: దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ ఇండియా’ తాజాగా ఉత్పత్తి సామర్థ్యం పెంపుపై దృష్టిపెట్టింది. 2020 నాటికి గుజరాత్ ప్లాంటులోని మూడు యూనిట్ల నుంచి తయారీని 7.5 లక్షల యూనిట్లకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. దీంతో మొత్తం తయారీ సామర్థ్యాన్ని ఏడాదికి 22.5 లక్షల యూనిట్లకుపైగా తీసుకెళ్లాలని చూస్తోంది. అలాగే 2020 తర్వాత తయారీని దీని కన్నా ఎక్కువ స్థాయికి తీసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే మార్గాలను అన్వేషిస్తోంది. ‘‘గుజరాత్ ప్లాంటులో మూడు యూనిట్లున్నాయి.
ఇందులో ఒక దానిలో తయారీ ప్రారంభమైంది. దీని సామర్థ్యం ఏడాదికి 2.5 లక్షల యూనిట్లు. ఇదే తయారీ సామర్థ్యం కలిగిన రెండో యూనిట్ కార్యకలాపాలు ఈ ఏడాది చివరకు ప్రారంభమవ్వొచ్చు. 2020 నాటికి మూడో యూనిట్ అందుబాటులోకి రావొచ్చు. ఈ మూడు ఫెసిలిటీల్లో 5,000–6,000 మంది ఉద్యోగులు ఉండేలా చూసుకుంటాం’’ అని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో కెనిచి అయుకవా తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన జపాన్–ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ (జేఐఎం) తొలి బ్యాచ్ ముగింపు సందర్భంగా మాట్లాడారు. కాగా కంపెనీ మరోవైపు గుర్గావ్, మానేసర్ ప్లాంట్లలో ఏడాదికి 15 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment