25 లక్షల మైలురాయికి మారుతీ ఆల్టో
న్యూఢిల్లీ: మారుతీ సుజుకి ఆల్టో కారు దేశీయ అమ్మకాలు 25 లక్షల మైలురాయిని దాటాయి. 25 లక్షలకు పైగా అమ్ముడైన తమ రెండో మోడల్ మారుతీ ఆల్టో అని మారుతీ సుజుకి కంపెనీ మంగళవారం తెలిపింది. (మొదటి మోడల్ మారుతీ 800) 2000 సంవత్సరంలో ఆల్టోని మార్కెట్లోకి తెచ్చామని, 14 ఏళ్లలోనే ఈ ఘనత సాధించామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్) మనోహర్ భట్ పేర్కొన్నారు. అంతేకాకుండా 2.85 లక్షల ఆల్టోలను ఎగుమతి చేశామని తెలిపారు.
చిన్న కార్ల సెగ్మెంట్లో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, ఏళ్ల తరబడి అగ్రస్థానంలో కొనసాగుతున్నామని వివరించారు. ప్రస్తుతం ఆల్టో మెడల్‌లో ఎనిమిది వేరియంట్లను అందిస్తున్నామని, ధరలు రూ.2.41 లక్షల నుంచి మొదలవుతాయని పేర్కొన్నారు. ఆల్టో మోడల్‌లో 1,000 సీసీ వేరియంట్, ఆల్టో కే10ను 2010, ఆగస్టులో కంపెనీ మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటిదాకా ఈ మోడల్ కార్లను నాలుగు లక్షలను విక్రయించామని వివరించారు. ఇక అంతా కొత్తదైన ఆల్టో 800ను 2012, అక్టోబర్‌లో మార్కెట్లోకి విడుదల చేశామని, 124 రోజుల్లోనే లక్ష కార్లు అమ్ముడయ్యాయని భట్ పేర్కొన్నారు.