న్యూఢిల్లీ: దేశీ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) చిన్న కార్ల విషయంలో పెద్ద వ్యూహాన్నే రచించింది. విక్రయాలు గణనీయంగా పడిపోతున్న నేపథ్యంలో మళ్లీ డిమాండ్‌ను పెంచే దిశగా కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఇక నుంచి కంపెనీ విడుదలచేసే అన్ని చిన్న కార్లు సీఎన్‌జీ(కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) మోడల్‌తోనే ఉండనున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఈ అంశంపై మాట్లాడిన కంపెనీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ.. ‘మారుతీ చిన్న కార్ల పోర్ట్‌ఫోలియోలోని మొత్తం వాహనాలు ఇక నుంచి సీఎన్‌జీలోకి మారనున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఈ ఇంధనాన్ని పర్యావరణ అనుకూలంగా, రవాణాకు సరిపడేదిగా గుర్తించింది. ఈ తరహా కార్ల వినియోగం పెంచేందుకు దేశవ్యాప్తంగా 10,000 సీఎన్‌జీ డిస్ట్రబ్యూషన్ అవుట్‌లెట్లను ఏర్పాటుచేయనున్నట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటించింది’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కంపెనీ ఎనిమిది మోడళ్లలో సీఎన్‌జీ ఆప్షన్ అందిస్తోంది. ఆల్టో, ఆల్టో కే10, వ్యాగన్‌ఆర్, సెలిరీయో, డిజైర్, టూర్ ఎస్, ఈకో, సూపర్ క్యారీ మినీ మోడళ్లలో సీఎన్‌జీ ఆప్షన్ ఉండగా.. మొత్తం 16 మోడళ్లను విక్రయిస్తోంది.
ఉత్పత్తిలో కోత విధించిన మారుతీ
కార్ల విక్రయాలు గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో మారుతీ సుజుకీ ఇండియా వరుసగా ఏడవ నెల్లోనూ ఉత్పత్తిలో కోత విధించింది. కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు అందించిన సమాచారం ప్రకారం.. ఆగస్టులో మొత్తం 1,11,370 యూనిట్లను ఉత్పత్తి చేసింది. గతేడాది ఇదేకాలంలో 1,68,725 యూనిట్లను ఉత్పత్తిచేసింది. ప్యాసింజర్ వాహన ఉత్పత్తి గతేడాది ఆగస్టులో 1,66,161 యూనిట్లు కాగా, ఈసారి 1,10,214 యూనిట్లకే పరిమితమైంది. ఈ విభాగంలో కంపెనీ అమ్మకాలు గతనెల్లో 33 శాతం క్షీణించాయి.
ఆటో రంగానికి తక్షణ చర్యలు: సియామ్ సంక్షోభంలో కూరుకుపోయిన ఆటో రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే విధానపరమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉందని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) అంటోంది. వస్తు, సేవల పన్ను తగ్గింపు, స్క్రాపేజ్ పాలసీ వంటి నిర్ణయాలను సత్వరం తీసుకుని పరిశ్రమను ఆదుకోవాలని కోరింది. ‘జీఎస్‌టీ రేటును ప్రస్తుతం అమల్లో ఉన్న 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని గతంలోనే కోరగా.. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ రేటు తగ్గితే వాహన ధరలు తగ్గి డిమాండ్ పెరిగేందుకు అవకాశం ఉందని భావిస్తునాం’ అని సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వాధేరా ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment