ట్రేడింగ్ ఇక 5 వరకూ?
♦ సమయం పెంచేందుకు ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలు రెడీ..!
♦ తమ వ్యాపారం సింగపూర్, దుబాయ్
♦ ఎక్స్ఛేంజీలకు వెళ్లిపోతోందని ఆందోళన...
♦ సాయంత్రం 5 గంటల వరకూ పెంచుతామని ప్రకటించి వెనక్కితగ్గిన ఎంఎస్‌ఈఐ
♦ సెబీ నుంచి తుది అనుమతులు లేకపోవడమే కారణం
దేశీ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లకు త్వరలో మరింత ఎక్కువ సమయం ట్రేడింగ్‌కు (షేర్ల కొనుగోలు, అమ్మకం లావాదేవీలు) అవకాశం లభిస్తుందా? తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. కొత్త స్టాక్ ఎక్సే్చంజ్ అయిన ఎస్ఎస్సీఐ(గతంలో దీని పేరు ఎంసీఎక్స్–ఎస్ఎక్స్)తో పాటు ప్రధాన ఎక్స్ఛేంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు కూడా ట్రేడింగ్ వ్యవధిని పెంచడానికి సుముఖంగా ఉండటంతో దీనికి బలం చేకూరుతోంది. ప్రస్తుతం స్టాక్ ఎక్సే్ఛంజీల్లో(ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3.30 వరకూ ట్రేడింగ్‌కు వీలుంది. మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు, షేర్ల ధరల్లో అవాంఛితమైన హెచ్చుతగ్గులను నివారించేందుకు ఉదయం ట్రేడింగ్ ప్రారంభానికి ముందు పావు గంటపాటు(అంటే 8.45 నుంచి 9 వరకూ) ప్రీ–ట్రేడింగ్ సెషన్‌ను ఎక్సే్ఛంజీలు నిర్వహిస్తున్నాయి.
కాగా, ఇప్పుడు మూడు స్టాక్ ఎక్సే్ఛంజీలూ కూడా ట్రేడింగ్ వ్యవధిని సాయంత్రం 5 వరకూ పెంచుకోవాలని భావిస్తున్నాయి. ఒకవేళ ఈక్విటీ స్టాక్స్‌కు వీలుకాకపోతే కనీసం ఈక్విటీ డెరివేటివ్స్(ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ విభాగం)లోనైనా వ్యవధి పొడిగించుకోవాలనేది ఎక్సే్ఛంజీల యోచన. తక్కువ వ్యవధి, పన్నుల పరంగా సమస్యలు తక్కువగా ఉండటం కారణంగా విదేశీ ఎక్సే్ఛంజీలు.. ప్రధానంగా సింగపూర్, దుబాయ్‌లు పెద్దమొత్తంలో తమ వ్యాపారాన్ని(ట్రేడింగ్ వాల్యూమ్స్) లాగేసుకుంటున్నాయని ఎక్సే్ఛంజీలు పేర్కొంటున్నాయి.
ముందే కూసిన ఎంఈసీఐ...
తమ ఈక్విటీ నగదు విభాగం(షేర్లు)లో ట్రేడింగ్ ముగింపు సమయాన్ని ఇప్పుడున్న సాయంత్రం 3.30 నుంచి 5 వరకూ పెంచుతున్నట్లు ఎంఎస్‌ఈఐ ఈ నెల 4న(మంగళవారం) ప్రకటించింది. అయితే, కొద్దిసేపటి తర్వాత ప్రస్తుతానికి ఈ వ్యవధి పెంపును నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. అయితే, దీనికి కారణమేంటనేది తెలియజేయలేదు. మార్కెట్ వర్గాల సమాచారం మేరకు సెబీ నుంచి దీనిపై తగిన తుది అనుమతులేవీ రాకపోవడం వల్లే ఎంఈసీఐ వెనక్కితగ్గినట్లు తెలుస్తోంది.
కమోడిటీ ఎక్సే్ఛంజీలతోపాటు గుజరాత్ గిఫ్ట్ సిటీలో ఏర్పాటైన అంతర్జాతీయ ఎక్సే్ఛంజీలు(ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ, బీఎస్ఈ ఐఎన్ఎక్స్) 12 గంటల నుంచి 22 గంటల పాటు ట్రేడింగ్‌ను(ఈక్విటీ డెరివేటివ్స్, కమోడిటీస్, కరెన్సీ విభాగాల్లో) నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధాన ఎక్సే్ఛంజీల్లో ఈక్విటీ విభాగంలోనూ ట్రేడింగ్ సమయం పెంచాలనేది కొంతమంది మద్దతుదారుల వాదన. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆర్థిక, రాజకీయ, ఇతరత్రా సంఘటనలు, వెలువడే వార్తలకు అనుగుణంగా ఇన్వెస్టర్లకు మార్కెట్లో తగిన అవకాశాలను కల్పించేందుకువీలుగా అంతర్జాతీయంగా చాలా ఎక్సే్ఛంజీలు(దేశీయ లేదా విదేశీ ఇన్వెస్టర్లకు) ట్రేడింగ్‌కు అధిక సమయాన్ని అమలుచేస్తున్నాయి.
బ్రోకర్ల నుంచి వ్యతిరేకత...
ప్రధానంగా అంతర్జాతీయంగా ఏవైనా కీలక సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు సింగపూర్ ఎక్సే్ఛంజీ లోనో, గిఫ్ట్ సిటీలోని ఎక్సే్ఛంజీలోనో విదేశీ ఇన్వెస్టర్లు తమ పొజిషన్లలో రిస్క్‌ను తట్టుకోవడం కోసంహెడ్జింగ్ చేసుకోవడానికి అవకాశం లభిస్తోంది. అయితే, దేశీ రిటైల్ ఇన్వెస్టర్లు , మ్యూచువల్ ఫండ్లకు ఈ అవకాశం ఉండటం లేదని.. ఈ అసమానతలను తొలగించేందుకు మనకూ ట్రేడింగ్ వ్యవధిని పెంచాలని కోరుతున్నారు. అయితే, ఈ పెంపునకు ప్రధానంగా బ్రోకర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
ఈక్విటీ మార్కెట్‌తో పోలిస్తే అధిక ట్రేడింగ్ వేళలు ఉన్న కమోడిటీ ఎక్సే్ఛంజీల్లో రిటైల్ కార్యకలాపాలు చాలా తక్కువన్న విషయాన్ని వారు ప్రధానంగా గుర్తుచేస్తున్నారు. ట్రేడింగ్ సమయాన్ని పెంచేందుకు తమకు ఎలాంటి నిర్వహణపరమైన ఇబ్బందులూ లేవని అయితే, బ్రోకర్ల నుంచి వ్యతిరేక త కారణంగానే తాము దీన్ని అమలుచేయలేకపోతున్నామని ఎన్ఎస్ఈ వర్గాలు చెబుతున్నాయి. ‘నిర్వహణ వ్యయా లతో పోలిస్తే ప్రయోజనాలు భారీగా ఉంటాయని అనుకుంటే ట్రేడింగ్ సమయాన్ని పొడిగించవచ్చు. అయితే, ఇప్పుడు అలాంటి పరిస్థితేమీ లేదు’ అని బీఎస్ఈ బ్రోకర్స్ ఫోరమ్ చర్మన్ ఉత్తమ్ బాగ్రి పేర్కొన్నారు. ట్రేడింగ్ వ్యవధిని కొద్ది గంటల పాటు పెంచినంతమాత్రాన వాల్యూమ్స్ పెరిగేందుకు అవకాశాలేవీ లేవని ఆయన వ్యాఖ్యానించారు.
2009లో కాస్త పెంచారు...
దేశీయ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ సమయాల్లో చివరిసారిగా 2009లో మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పట్లో ఉదయం 9.55 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకూ ట్రేడింగ్ జరిగేది. అయితే, సెబీ 2009 అక్టోబర్‌లో ఎక్సే్ఛంజీల ట్రేడింగ్ సమాయాన్ని రెండున్నర గంటల మేర పెంచుకునేందుకు(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకూ) ఆమోదం తెలిపింది. అయితే, 5 వరకూ పెంచేందుకు బ్రోకర్లు అప్పుడు కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో వారి అభిప్రాయం మేరకు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు అదే నెలలో ట్రేడింగ్ వ్యవధిని దాదాపు గంటపాటు మాత్రమే పెంచాయి.
ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 వరకూ ట్రేడింగ్‌ను(ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్) అమల్లోకి తీసుకొచ్చాయి. ఇదే విధానం ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే, కరెన్సీ డెరివేటివ్స్‌లో మాత్రం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకూ ప్రస్తుతం ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. అయితే, ఇప్పుడు ఎంఎస్‌ఈఐ గనుక ట్రేడింగ్ సమయాన్ని సాయంత్రం 5 వరకూ పెంచితే... ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు కూడా దీన్ని తప్పనిసరిగా అమలుచేయాల్సిన పరిస్థితి ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.