మారుతీ వేగన్ ఆర్ అమ్మకాలు @ 15 లక్షలు
న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ కారు 15 లక్షల అమ్మకాల మైలురాయిని సాధించింది. వినియోగదారుల అభిరుచులకనుగుణంగా ఎప్పటికప్పుడు ఈ మోడల్‌లో మార్పులు, చేర్పులు చేయడం, విజయవంతమైన మార్కెటింగ్ విధానాల ద్వారా ఈ ఘనతను సాధించామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్) మనోహర్ భట్ చెప్పారు.
ఈ మోడల్‌ను 2000 సంవత్సరంలో మార్కెట్లోకి తెచ్చామని, భారత్‌లో విక్రయమవుతున్న అత్యుత్తమ 5 బ్రాండ్లలో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. 2010-11లో ఈ మోడల్‌లో సీఎన్‌జీ వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. గతనెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో వ్యాగన్ ఆర్ మూడో స్థానంలో నిలిచిందని సియామ్(సొ సైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మాన్యుఫాక్చరర్స్) వెల్లడించిందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 1,56,000 కార్లను విక్రయించామని, ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ 93 వేలకు పైగా కార్లను అమ్మామని చెప్పారు. కాగా ఈ కంపెనీ మోడళ్లు- మారుతీ 800, ఆల్టోలు ఒక్కోటి 25 లక్షలకు పైగా అమ్ముడయ్యాయి.