మారుతీ లాభం స్కిడ్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీపై మందగమనం ప్రభావం పడింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2013-14, క్యూ4)లో కంపెనీ నికర లాభం 35.46 శాతం దిగజారి రూ.800 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా అమ్మకాలు తగ్గడం, ప్రచారం ఇతరత్రా వ్యయాలు పెరగడంతోపాటు ఎక్సైజ్ సుంకం తగ్గింపునకు సంబంధించి డీలర్లకు నష్టపరిహారం చెల్లింపులు ఇతరత్రా అంశాలు లాభాలు తగ్గేందుకు దారితీశాయని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్‌సీ భార్గవ పేర్కొన్నారు. క్యూ4లో కంపెనీ మొత్తం ఆదాయం కూడా 9.48 శాతం క్షీణించింది. రూ.13,056 కోట్ల నుంచి రూ.11,818 కోట్లకు తగ్గింది.
పూర్తి ఏడాదికి రికార్డు లాభం...
2013-14 పూర్తి ఆర్థిక సంవత్సరంలో మారుతీ కన్సాలిడేటెడ్ నికర లాభం 15.23 శాతం ఎగబాకి రూ.2,853 కోట్లుగా నమోదైంది. ఇది కంపెనీ చరిత్రలో అత్యధిక వార్షిక నికర లాభం కావడం గమనార్హం. కాగా, గతేడాది కంపెనీ మొత్తం ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.43,216 కోట్ల నుంచి రూ.43,271 కోట్లకు చేరింది. వాహన అమ్మకాల సంఖ్య 11,71,434 నుంచి 11,55,041కి తగ్గింది. విక్రయాల్లో 1.4 శాతం క్షీణత నమోదైంది. 2013-14 ఏడాదికిగాను కంపెనీ రూ.5 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.12 డివిడెండ్‌ను ప్రకటించింది.ఈ ఏడాది ప్రీమియం సెడాన్ సియాజ్‌తోపాటు మూడు కొత్త కార్లను మారుతీ విడుదల చేయనుంది. ఫలితాల ప్రభావంతో కంపెనీ షేరు ధర బీఎస్‌ఈలో శుక్రవారం 1.35 శాతం క్షీణించి రూ.1,956 వద్ద ముగిసింది.