మారుతీ ఇగ్నిస్ వచ్చేసింది
పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యం
• ధర రూ.4.59 లక్షల నుంచి రూ.7.8 లక్షల రేంజ్‌లో
ముంబై: మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ.. ప్రీమియమ్ కాంపాక్ట్ వెహికల్, ఇగ్నిస్‌ను శుక్రవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో లభించే ఈ కార్ల ధరల్ని రూ.4.59 లక్షల నుంచి రూ.7.8 లక్షల రేంజ్‌లో (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించామని మారుతీ సుజుకీ తెలిపింది. తమ ప్రీమియమ్ రిటైల్ చెయిన్ నెక్సా ద్వారా ఇగ్నిస్ కార్లను విక్రయిస్తామని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు. సిగ్మా, డెల్టా, డెల్టా ఏఎంటీ, జెటా, జెటా ఏఎంటీ, ఆల్ఫా వేరియంట్లలో, మొత్తం తొమ్మిది విభిన్నమైన రంగుల్లో ఈ కారు లభ్యమవుతుందని వివరించారు.
1.2 పెట్రోల్ ఇంజిన్ ఉన్న ఇగ్నిస్ కారు ధరలు రూ.4.59 లక్షలు–రూ.6.69 లక్షల రేంజ్‌లో, 1.3 డీజిల్ ఇంజిన్ ఇగ్నిస్ కారు ధరలు రూ.6.39 లక్షలు–రూ.7.8 లక్షల రేంజ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. యువ వినియోగదారులు లక్ష్యంగా అందిస్తున్న ఈ ఇగ్నిస్ కారులో 98.5% స్థానిక విడిభాగాలనుపయోగించామని, ఈ కారు డిజైనింగ్, తయారీ కోసం రూ.950 కోట్లు వెచ్చించినట్లు వివరించారు. పెట్రోల్ మోడల్ 20.89 కిమీ, డీజిల్ మోడల్ 26.80 కి.మీ. మైలేజీని ఇస్తాయని తెలిపారు. 2020 కల్లా భారత్‌లో 15 కొత్త మోడళ్లను అందిస్తామని పేర్కొన్నారు. అప్పటికి ఏటా 20 లక్షల కార్లను విక్రయించాలనేది తమ మధ్యకాలిక లక్ష్యమని తెలిపారు.
మారుతీ ఇగ్నిస్ ప్రత్యేకతలు..
ప్రయాణికులకు మరింత భద్రత నిచ్చే కొత్త జనరేషన్ రిజిడ్ ప్లాట్‌ఫార్మ్.. టోటల్ ఎఫెక్టివ్ కంట్రోల్ టెక్నాలజీ(టెక్ట్) ప్లాట్‌ఫార్మ్‌పై ఇగ్నిస్ ను రూపొందించామని కంపెనీ పేర్కొంది. ఆటో గేర్ షిఫ్ట్ ఫీచర్, డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన యాంటీలాక్‌బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్), పిల్లల కోసం ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఫీచర్, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డే టైమ్ రన్నింగ్‌లైట్స్, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లున్నాయి.