
ముడిపదార్ధాల ధరలు పెరగడంతో వాహన ధరలను పెంచుతున్నట్టు మారుతి సుజుకి వెల్లడించింది.
సాక్షి, న్యూఢిల్లీ : ఆటోమొబైల్ సేల్స్ తగ్గుముఖం పడుతూ ఆర్థిక మందగమనంపై భయాలను పెంచుతుంటే వచ్చే ఏడాది జనవరి నుంచి వివిధ కార్ల మోడల్స్‌పై ధరలను పెంచనున్నట్టు మారుతి సుజుకి ప్రకటించింది. ముడిపదార్ధాల ధరలు పెరగడంతో కార్ల ధరలను పెంచడం అనివార్యమైందని వివరణ ఇచ్చిన కంపెనీ ఏ వాహనాలపై ధరలను పెంచుతుందనే వివరాలు వెల్లడించలేదు. పలు ముడిపదార్ధాల ధరలు పెరగడంతో గత ఏడాదిగా తమ వాహనాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని కార్ల ధరలు పెంచాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ మారుతి సుజుకి సెబీకి సమాచారం అందించింది.
ముడిపదార్ధాల ధరలు పెరగడంతో వాహన ధరల పెంపు ద్వారా కొంత భారాన్ని వినియోగదారులపై మోపడం తప్పడం లేదని, జనవరి 2020 నుంచి వివిధ మోడల్స్‌పై పన్ను భారం విభిన్నంగా ఉంటుందని మారుతి పేర్కొంది.కాగా అక్టోబర్ మినహా ఇటీవల పలు మాసాల్లో ఆటోమొబైల్ సేల్స్ గణనీయంగా పడిపోవడం ఆటోమొబైల్ పరిశ్రమలో సంక్షోభానికి దారితీసిన సంగతి తెలిసిందే. అమ్మకాలు పడిపోవడంతో పలు దిగ్గజ కంపెనీలు కొన్ని ప్రాంతాల్లో తమ ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేసిన పరిస్థితీ ఎదురైంది.