న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్ అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఉత్పత్తిని తగ్గించింది. ఫిబ్రవరిలో వాహనాల తయారీలో 8 శాతం పైగా కోత విధించింది. స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం మారుతీ సుజుకీ గత నెల 1,48,959 యూనిట్లు తయారు చేసింది. గతేడాది ఫిబ్రవరిలో ఉత్పత్తి చేసిన 1,62,524 యూనిట్లతో పోలిస్తే ఇది 8.3 శాతం తక్కువ కావడం గమనార్హం. ఆల్టో, స్విఫ్ట్, విటారా బ్రెజా తదితర ప్యాసింజర్ కార్ల ఉత్పత్తి 8.4 శాతం తగ్గింది. గత ఫిబ్రవరిలో 1,61,116 యూనిట్లతో పోలిస్తే 1,47,550 యూనిట్లకు క్షీణించింది. అయితే ఈకో, ఆమ్ని వంటి వ్యాన్స్ విభాగం ఉత్పత్తి 13,827 యూనిట్ల నుంచి 22.1 శాతం వృద్ధితో 16,898 యూనిట్లకు పెరిగింది. సూపర్ క్యారీ ఎల్‌సీవీ తయారీ ఒక్క యూనిట్ మేర పెరిగింది. అటు ఉత్పత్తిలో కోతకు కారణాలపై స్పందించేందుకు మారుతీ సుజుకీ నిరాకరించింది.
మారుతీ సుజుకీ ఉత్పత్తి జనవరిలో 1,58,396 యూనిట్ల నుంచి 15.6 శాతం వృద్ధితో 1,83,064 యూనిట్లకు చేరింది. ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి 1,56,168 యూనిట్ల నుంచి 14.3 శాతం వృద్ధి చెంది 1,78,459 యూనిట్లకు పెరిగింది. అమ్మకాల విషయానికొస్తే.. జనవరిలో మారుతీ సుజుకీ విక్రయాలు 1.1 శాతం పెరిగాయి. గతేడాది జనవరిలో నమోదైన 1,40,600 యూనిట్ల నుంచి 1,42,150 యూనిట్లకు చేరాయి. అయితే ఫిబ్రవరిలో మాత్రం దేశీ విక్రయాలు 0.9 శాతం క్షీణించి 1,39,100 యూనిట్ల నుంచి 1,37,900 యూనిట్లకు తగ్గాయి. కంపెనీకి గురుగ్రామ్, మానెసర్‌లో 15.5 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యంతో రెండు ప్లాంట్లు ఉన్నాయి. దీంతో పాటు మాతృసంస్థ సుజుకీకి గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంటులో 2.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో ఒక లైన్ ఉంది.
మారుతీ కార్ల ఉత్పత్తిలో కోత
Published Tue, Mar 19 2019 12:00 AM | Last Updated on Tue, Mar 19 2019 5:02 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment