రాజేశ్ గోపీనాథన్‌కు టీసీఎస్ పగ్గాలు
• చంద్రశేఖరన్ స్థానంలో ఎంపిక
• ఫిబ్రవరి 21న బాధ్యతల స్వీకరణ
ముంబై: టీసీఎస్ నూతన ఎండీ, సీఈవోగా రాజేశ్ గోపీనాథన్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆ బాధ్యతల్లో ఉన్న ఎన్.చంద్రశేఖరన్ టాటా గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులు కావడంతో, ఆయన స్థానంలో నూతన నాయకుడిగా గోపినాథన్‌ను టీసీఎస్ ఖరారు చేసింది. ఫిబ్రవరి 21న ఎన్.చంద్రశేఖరన్ నుంచి బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది. అలాగే, కంపెనీ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఎఫ్‌వో)గా ఎన్ గణపతి సుబ్రమణ్యంను నియమించింది.
ఈయనను టీసీఎస్ బోర్డు డైరెక్టర్‌గానూ ఎంపిక చేసింది. ప్రస్తుతం సుబ్రమణ్యం టీసీఎస్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. రాజేశ్ గోపీనాథన్ 2001 నుంచీ టీసీఎస్‌లో పనిచేస్తున్నారు. 2013 ఫిబ్రవరిలో టీసీఎస్ సీఎఫ్‌వోగా నియమితులయ్యారు. ఎన్S. చంద్రశేఖరన్ చదివిన తిరుచ్చి ఆర్‌ఈసీలోనే రాజేశ్ గోపీనాథన్ కూడా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. టీసీఎస్ ఎదుగుదలలో ఆయన పాత్ర కూడా ఉంది.