మెర్సిడెస్ బెంజ్ ‘లోకల్’ జీఎల్‌ఏ ఎస్‌యూవీ
♦ ధర 2 లక్షల వరకూ తగ్గుతుంది
♦ మూడో అసెంబ్లింగ్ లైన్ ఆరంభం
పుణే: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ గురువారం జీఎల్‌ఏ ఎస్‌యూవీను మార్కెట్లోకి తెచ్చింది. 60 శాతం స్థానికంగా తయారైన విడిభాగాలతోనే ఈ కారును తయారు చేశామని మెర్సిడెస్ బెంజ్ కంపెనీ తెలిపింది. భారత్‌లోనే అసెంబుల్ చేసిన తమ ఆరవ మోడల్ ఇదని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇబెర్‌హర్డ్ కెర్న్ చెప్పారు.
ఇక్కడకు సమీపంలోని చకన్ ప్లాంట్‌లో మూడవ అసెంబ్లీ లైన్‌ను లాంఛనంగా ప్రారంభించామని పేర్కొన్నారు. దిగుమతి చేసుకున్న జీఎల్‌ఏ ఎస్‌యూవీల ధర రూ.31.31-34.25 లక్షల రేంజ్‌లో ఉంటాయని, ఇక ఇప్పుడు వీటిని స్థానికంగానే అసెంబుల్ చేస్తున్నందున వీటి ధరలు రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకూ తగ్గుతాయని వివరించారు. భారత్‌లో తమ వార్షిక అసెంబ్లింగ్ సామర్థ్యం 10 వేల కార్లని, రూ.150 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసిన ఈ మూడో అసెంబ్లీ లైన్‌తో ఈ సంఖ్య రెట్టింపై 20,000కు చేరుతుందని పేర్కొన్నారు.
ఇంత ఎక్కువ స్థాయి స్థాపిత ఉత్పాదక సామర్థ్యమున్న ఏకైక లగ్జరీ కంపెనీ తమదేనని పేర్కొన్నారు. భారత్‌లో 1994 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటిదాకా రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెట్టామని వివరించారు. భారత్‌లో ఇంత ఎక్కువగా పెట్టుబడులు పెట్టిన ఏకైక లగ్జరీ కార్ల కంపెనీ కూడా తమదేనని పేర్కొన్నారు.