వరుసగా ఆరు రోజులపాటు ర్యాలీ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లకు అలుపొచ్చింది. దీంతో లాభనష్టాల మధ్య ఆయాసపడుతున్నాయి. వెరసి మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ 318 పాయింట్లు క్షీణించి 33,791కు చేరగా.. నిఫ్టీ 102 పాయింట్లు పతనమై 9,959ను తాకింది. అయితే ప్రపంచ స్టాక్ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాల కారణంగా మార్కెట్లు తొలుత కొంతమేర లాభాల మధ్య కదిలాయి. ఈ నేపథ్యంలోనూ కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీలు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం ఊపందుకుంది. జాబితాలో జిందాల్ స్టీల్, బిర్లా సాఫ్ట్ లిమిటెడ్, వెండిట్ ఇండియా, వీల్స్ ఇండియా, సారేగామా ఇండియా చోటు చేసుకున్నాయి. ఇతర వివరాలు చూద్దాం..
జిందాల్ స్టీల్
ప్రయివేట్ రంగ మెటల్ దిగ్గజం జిందాల్ స్టీల్ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 6 శాతం జంప్‌చేసి రూ. 135 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 138 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 12.35 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 13.31 లక్షల షేర్లు చేతులు మారాయి.
బిర్లాసాఫ్ట్
ప్రయివేట్ రంగ ఐటీ సేవల కంపెనీ బిర్లాసాఫ్ట్ లిమిటెడ్ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 6 శాతం జంప్‌చేసి రూ. 80 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 63,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 95,000 షేర్లు చేతులు మారాయి.
వెండిట్ ఇండియా
అబ్రాసివ్స్, గ్రైండింగ్ వీల్స్ తయారీ కంపెనీ వెండిట్ ఇండియా షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 504 ఎగసి రూ. 3023 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం కేవలం 60 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1650 షేర్లు చేతులు మారాయి.
వీల్స్ ఇండియా
ఆటో రంగ విడిభాగాల తయారీ కంపెనీ వీల్స్ ఇండియా షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 86 ఎగసి రూ. 517 వద్ద ట్రేడవుతోంది. ఈ కౌంటర్లో బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం కేవలం 550 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 12.1 లక్షలకుపైగా షేర్లు చేతులు మారడం విశేషం.
సారేగామా ఇండియా
దేశంలోనే అతిపెద్ద మ్యూజిక్ లైబ్రరీ కలిగిన కంపెనీ సారేగామా ఇండియా షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 67 ఎగసి రూ. 402 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం కేవలం 4500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 23,000 షేర్లు చేతులు మారాయి.
Comments
Please login to add a commentAdd a comment