స్పైస్ జెట్ నుంచి ‘ఫ్లై ఫర్ ష్యూర్’ ఆఫరు
ఫ్లయిట్ రద్దయినా ప్రయాణానికి భరోసా
న్యూఢిల్లీ: తమ ఫ్లయిట్ సర్వీసుల నిర్వహణలో గంటన్నర పైగా జాప్యం జరిగినా, లేదా ఫ్లయిట్ రద్దయినా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూసేలా స్పైస్‌జెట్ కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఇటువంటి సందర్భాల్లో ప్యాసింజర్లు ఇరవై నాలుగు గంటలలోగా మరో ప్రత్యామ్నాయ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించేందుకు వీలుగా రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. ఫ్లై ఫర్ ష్యూర్ పేరిట ప్రకటించిన ఈ ఆఫర్.. కొన్ని షరతులకు లోబడి పనిచేస్తుంది. వాతావరణం సహా పలు కారణాలతో ఫ్లయిట్లు రద్దు కావడమో లేక జాప్యం జరగడమో అవుతున్న నేపథ్యంలో స్పైస్‌జెట్ ఆఫర్ ప్రాధాన్యం సంతరించుకుంది.
స్పైస్‌జెట్ ఫ్లై ఫర్ ష్యూర్‌ను వినియోగించుకోదల్చుకున్న వారు టికెట్ బుక్ చేసుకునేటప్పుడే అదనంగా రూ. 299 కట్టాల్సి ఉంటుంది. దీనితో ఫ్లయిట్ 90 నిమిషాల పైగా జాప్యం జరిగినా, లేదా ఫ్లయిట్ మిస్సయినా (చెకిన్ సమయం ముగిశాక 30 నిమిషాల గరిష్ట వ్యవధి) ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రత్యామ్నాయ ఫ్లయిట్ టికెట్టుకయ్యే ఖర్చును (గరిష్టంగా అసలు టికెట్ ధర కన్నా రెట్టింపు మొత్తం దాకా లేదా రెండో టికెట్టు ధర.. రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తం) స్పైస్‌జెట్ ప్రయాణికులకు రీయింబర్స్ చేస్తుంది. దీన్ని క్లెయిమ్ చేసుకోవడానికి.. ప్రయాణం చేసిన తర్వాత ఏడు రోజుల్లోగా నిర్దేశిత పత్రాలు, సమాచారాన్ని సంస్థకు అందజేయాల్సి ఉంటుంది.