స్పైస్‌జెట్ ప్రేమికుల ఆఫర్
* రూ.1,599 నుంచి ప్రారంభం
* బుకింగ్స్ శుక్రవారం వరకే
వాలంటైన్స్ డే సందర్భంగా చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తక్కువ ధరకే విమానయానాన్ని ఆఫర్ చేస్తోంది. దేశీయ నెట్‌వర్క్‌లో రూ.1,599 కనిష్ట ధర నుంచి విమాన టికెట్లను ఆఫర్ చేస్తున్నామని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కానేశ్వరన్ అవిలి తెలిపారు. ఈ ఆఫర్‌కు బుకింగ్స్ బుధవారం నుంచి ప్రారంభమయ్యాయని శుక్రవారం వరకూ ఉంటాయని పేర్కొన్నారు.
ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 15 మధ్య జరిగే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. కంపెనీ యాజమాన్యం మారుతున్న నేపథ్యంలో స్పైస్‌జెట్ నుంచి వస్తోన్న రెండో ఆఫర్ ఇదని పేర్కొన్నారు. గత నెలలో తమ దేశీయ నెట్‌వర్క్ రూట్లలో రూ.1,499 ధర నుంచి విమాన టికెట్లను ఆఫర్ చేశామని గుర్తు చేశారు. ఆ ఆఫర్‌కు మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. ఈ ఉత్సాహంతోనే తాజాగా వాలంటైన్స్ డే ఆఫర్‌ను అందిస్తున్నామని వివరించారు.
కాగా తమకు మరిన్ని రాయితీలు కావాలంటూ స్పైస్‌జెట్ ప్రభుత్వాన్ని కోరిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. విమానయాన ఇంధనం కొనుగోలు, తదితర అంశాలకు సంబంధించి కొన్ని రాయితీలు కావాలని స్పైస్‌జెట్ కోరుతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఇంధన బిల్లు రూ.3,200 కోట్లుగా ఉంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో విమానయాన ఇంధనం ధర భారీగా తగ్గింది. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంధన బిల్లు బాగా తగ్గుతుందని అంచనా.