తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోయిన మొబైల్ కనెక్షన్లు
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ కనెక్షన్లు తగ్గిపోయాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత మార్చి నుంచి జనవరి మధ్య 10 నెలల కాలంలో దాదాపు ఏడున్నర లక్షల మొబైల్ కనెక్షన్లు, 1.34 లక్షల ల్యాండ్‌లైన్ కనెక్షన్లు తగ్గిపోయాయని కేంద్ర కమ్యునికేషన్ల శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బుధవారం అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. 31 మార్చి 2017న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తంగా 8,49,42,695 మొబైల్ కనెక్షన్లు ఉండగా 31 జనవరి 2018 నాటికి ఈ సంఖ్య 8,41,95,340 కి తగ్గాయని వెల్లడించారు.
అత్యధిక మొబైల్ ఖాతాదారులు కలిగి ఉన్న సంస్థగా 2.72 కోట్ల కనెక్షన్లతో ఎయిర్‌టెల్ ప్రథమ స్థానంలో నిలువగా ఆ తదుపరి స్థానాల్లో ఐడియా, జియో, బీఎస్‌ఎన్‌ఎల్, వొడాఫోన్ సంస్థలు నిలిచాయి. ఈ పది నెలల కాలంలో ఎయిర్‌టెల్, జియో, బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థలకు ఖాతాదారులు పెరగ్గా ఐడియా, వొడాఫోన్, ఎయిర్‌సెల్, టెలినార్, రిలయన్స్, టాటా సంస్థల ఖాతాదారులు తగ్గారు. అయితే అంతకుముందు ఏడాది కాలానికి మొత్తంగా 1.02 కోట్ల మేర కనెక్షన్లు పెరగడం విశేషం. ఇందులో జియో వాటానే 93.71 లక్షలుగా ఉంది.
ఇక ల్యాండ్‌లైన్ల విషయంలో రెండు రాష్ట్రాల్లో కలిపి ఇదే కాలంలో 16,37,790 ల్యాండ్‌లైన్ల సంఖ్య నుంచి 15,03,028కి తగ్గింది. అంటే దాదాపు 1.34 లక్షల కనెక్షన్లు తగ్గాయి. 31 మార్చి 2015 నుంచి 31 జనవరి 2018 మధ్య కాలంలో దాదాపు 3.65 లక్షల కనెక్షన్లు తగ్గిపోయాయని మంత్రి తెలిపారు. ఇందులో ప్రధానంగా బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ఖాతాదారులు తగ్గిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment