త్వరలో మొబైల్ టారిఫ్‌లకు రెక్కలు!
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ కాల్ చార్జీలు త్వరలో పెరగనున్నాయా? అవుననే అంటోంది సెల్యులార్ ఆపరేటర్ల అసోసియేషన్(సీఓఏఐ). రానున్న స్పెక్ట్రం వేలంలో టెలికం కంపెనీలు భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందని.. దీనివల్ల ఆ భారాన్ని టారిఫ్‌ల పెంపు రూపంలో వినియోగదార్లకు బదలాయించే అవకాశాలున్నాయని సీఓఏఐ డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 900, 1,800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లలో స్పెక్ట్రం వేలానికి టెలికం శాఖ సన్నాహాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసిన వేలం ప్రారంభ ధరల(రిజర్వ్ ప్రైస్) ప్రకారం చూసుకున్నా టెల్కోలు కనీసం రూ.40,000 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుందని మాథ్యూస్ చెప్పారు. వేలం తర్వాత టెలికం సంస్థల రుణ భారం భారీగా ఎగబాకుతుందని.. దీన్ని తట్టుకోవాలంటే కచ్చితంగా టారిఫ్‌లు పెంచాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. లాభదాయకతను మెరుగుపరుచుకోవడానికిగాను టెల్కోలు ఇప్పటికే ఉచిత ఆఫర్లు ఇతరత్రా ప్రోత్సాహకాల్లో కోత, ఉపసంహరణ చర్యలను చేపడుతూవస్తున్న సంగతి తెలిసిందే.