Cellular Operators Association
-
త్వరలో మొబైల్ టారిఫ్‌లకు రెక్కలు!
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ కాల్ చార్జీలు త్వరలో పెరగనున్నాయా? అవుననే అంటోంది సెల్యులార్ ఆపరేటర్ల అసోసియేషన్(సీఓఏఐ). రానున్న స్పెక్ట్రం వేలంలో టెలికం కంపెనీలు భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందని.. దీనివల్ల ఆ భారాన్ని టారిఫ్‌ల పెంపు రూపంలో వినియోగదార్లకు బదలాయించే అవకాశాలున్నాయని సీఓఏఐ డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 900, 1,800 మెగాహెర్ట్జ్ బ్యాండ్లలో స్పెక్ట్రం వేలానికి టెలికం శాఖ సన్నాహాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసిన వేలం ప్రారంభ ధరల(రిజర్వ్ ప్రైస్) ప్రకారం చూసుకున్నా టెల్కోలు కనీసం రూ.40,000 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుందని మాథ్యూస్ చెప్పారు. వేలం తర్వాత టెలికం సంస్థల రుణ భారం భారీగా ఎగబాకుతుందని.. దీన్ని తట్టుకోవాలంటే కచ్చితంగా టారిఫ్‌లు పెంచాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. లాభదాయకతను మెరుగుపరుచుకోవడానికిగాను టెల్కోలు ఇప్పటికే ఉచిత ఆఫర్లు ఇతరత్రా ప్రోత్సాహకాల్లో కోత, ఉపసంహరణ చర్యలను చేపడుతూవస్తున్న సంగతి తెలిసిందే. -
గ్రామీణ మొబైల్ యూజర్లు @ 30 కోట్లు
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో జూన్‌లో కొత్తగా 21 లక్షల మేర జీఎస్ఎం కనెక్షన్లు పెరిగాయి. దీంతో మొత్తం గ్రామీణ జీఎస్ఎం యూజర్ల సంఖ్య 30.27 కోట్లకు చేరినట్లు సెల్యులార్ ఆపరేటర్ల అసోసియేషన్ (సీవోఏఐ) తెలిపింది. భారతీ ఎయిర్టెల్ కనెక్షన్లు అత్యధికంగా 9.66 కోట్లుగాను, వొడాఫోన్ కనెక్షన్లు 9.09 కోట్లుగా, ఐడియా సెల్యులార్ కనెక్షన్లు 7.68 కోట్లుగా, ఎయిర్‌సెల్ 2.59 కోట్లు, యూనినార్ యూజర్ల సంఖ్య 1.23 కోట్లుగాను ఉంది. మొత్తం మీద వొడాఫోన్, ఐడియా సంస్థలకు సంబంధించి పట్టణ ప్రాంతాలను మించి గ్రామీణ యూజర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అదే ఎయిర్టెల్, ఎయిర్ ఎల్, యూనినార్ విషయానికొస్తే.. పట్టణ ప్రాంతాల యూజర్ల సంఖ్య అధికంగా ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం జీఎస్ఎం యూజర్ల సంఖ్య 73.95 కోట్లకు పెరిగింది. 30 కోట్లు దాటిన ఎయిర్టెల్ కస్టమర్ల సంఖ్య మొబైల్, ఫిక్సిడ్ లైన్, డీఎస్ఎల్, డీటీహెచ్ తదితర విభాగాలన్నింటితో కలిపి 30 కోట్ల కస్టమర్ల మైలురాయిని అధిగమించినట్లు భారతీ ఎయిర్టెల్ వెల్లడించింది. 1995లో కార్యకలాపాలు ప్రారంభించిన ఎయిర్టెల్ 2009లో 10 కోట్లు, 2012లో 20 కోట్ల కస్టమర్ల స్థాయిని సాధించింది. రెండేళ్ళ కన్నా తక్కువ వ్యవధిలోనే అదనంగా మరో 10 కోట్ల కస్టమర్లు జతయ్యారని ఎయిర్టెల్ పేర్కొంది. ప్రస్తుతం ఆసియా, ఆఫ్రికాలోని 20 దేశాల్లో కంపెనీ కార్యకలాపాలు ఉన్నాయి. -
82 లక్షలు పెరిగిన జీఎస్ఎం కనెక్షన్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జీఎస్ఎం మొబైల్ కనెక్షన్ల సంఖ్య మార్చ్‌లో 82.6 లక్షలు పెరిగి 72.19 కోట్లకు చేరుకుంది. క్రితం నెలతో పోలిస్తే ఇది 1.16 శాతం పెరుగుదల. సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలీ సబ్‌స్క్రయిబర్స్ వివరాలు లేవు. ఈ రెండూ కూడా జీఎస్ఎం సర్వీసులు ఇస్తున్నప్పటికీ.. గణాంకాలను సీవోఏఐకి నివేదించకపోవడమే ఇందుకు కారణం. అత్యధికంగా ఐడియా సెల్యులర్ కనెక్షన్లు 22.3 లక్షలు) పెరగ్గా, వొడాఫోన్ (22.2 లక్షలు), ఎయిర్టెల్ (18.9 లక్షలు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. గతేడాది నవంబర్ నుంచి జీఎస్ఎం కనెక్షన్లు పెరుగుతూ వచ్చినా.. మార్చ్‌లో మాత్రం తగ్గడం గమనార్హం. ఫిబ్రవరిలో సుమారు 1.02 కోట్ల కొత్త కనెక్షన్లు వచ్చాయి -
తగ్గుతున్న ఎస్ఎమ్మెస్ల ప్రాభవం
న్యూఢిల్లీ: మన దగ్గరకి కాస్త ఆలస్యంగా 1998 ప్రాంతంలో వచ్చినప్పటికీ.. ఎస్ఎమ్మెస్లు దాదాపు 20 ఏళ్లుగా చలామణీలో ఉన్నాయి. దాదాపు ఏడాదిన్నర క్రితం దాకా టెలికం ఆపరేటర్లకు వచ్చే ఆదాయంలో సుమారు 10% వాటా ఎస్ఎమ్మెస్ల నుంచే ఉండేది. కానీ, ప్రస్తుతంఇది 5-6%కి తగ్గిపోయింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్‌కి వచ్చిన ఆదాయంలో మెసేజింగ్, విలువ ఆధారిత సర్వీసుల ద్వారా 8.2% దాకా వాటా ఉంది. కానీ ఇది జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి వచ్చే సరికి 6.7%కి తగ్గిపోయింది. వొడాఫోన్ విషయానికొస్తే.. క్రితం ఏడాది ప్రథమార్ధంతో పోలిస్తే 2013-14 ప్రథమార్ధంలో మెసేజింగ్ సేవల ఆదాయం ఏకంగా 7% తగ్గింది. అటు ఐడియా పరిస్థితి కూడా అలాగే ఉంది. క్రితం క్వార్టర్‌తో పోలిస్తే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో డేటాయేతర సర్వీసుల ద్వారా వచ్చే ఆదాయం 1.4% క్షీణించింది. ఈ నేపథ్యంలో వచ్చే కొన్నేళ్లలో ఎస్ఎమ్మెస్ల ద్వారా వచ్చే ఆదాయం 45-50% దాకా పడిపోవచ్చని అంచనాలు ఉన్నట్లు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్(సీవోఏఐ) డెరైక్టర్ జనరల్ రాజన్ మ్యాథ్యూస్ తెలిపారు. మొబైల్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సంస్థ ‘ఓవమ్’ అధ్యయనం ప్రకారం 2011లో ఎస్ఎమ్మెస్ల వృద్ధి రేటు 14 % ఉండగా.. 2013లో 8%కి పడిపోయింది. 2015 చివరి నాటికి మరింత తగ్గగలవని అంచనా. పెరుగుతున్న డేటా సేవలు.. తగ్గుతున్న ఎస్ఎమ్మెస్ల ఆదాయాలను భర్తీ చేసుకునేందుకు టెలికం కంపెనీలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రాంతీయ భాషల్లో ఎస్ఎమ్మెస్ల సేవలను ప్రవేశపెడుతున్నాయి. డేటా సేవల ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరుగుతోందని మ్యాథ్యూస్ తెలిపారు. టెల్కోల ఆదాయ గణాంకాలే ఇందుకు నిదర్శనం. 2013-14 ద్వితీయ త్రైమాసికంలో ఎయిర్టెల్ మొత్తం మొబైల్ ఆదాయాల్లో డేటా సర్వీసుల ద్వారా వచ్చేది 5.2% నుంచి 9.2%కి పెరిగింది. 2013-14 ప్రథమార్ధంలో వొడాఫోన్ డేటా ఆదాయం (బ్రౌజింగ్ మినహా) ఏకంగా 45.9% ఎగిసింది. అధ్యయనం ప్రకారం వాట్స్‌యాప్, బ్లాక్‌బెర్రీ మెసెంజర్ (బీబీఎం), వుయ్‌చాట్ లాంటి ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్స్ కోసం ఈ డేటా వినియోగం ఎక్కువగా ఉంటోంది. 2016-17 నాటికి డేటా సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 34 శాతం పెరిగి 35 కోట్లకు చేరగలదని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 3జీ సర్వీసులు ఇంకాస్త ప్రాచుర్యంలోకి వస్తే డేటా సేవల ద్వారా టెల్కోల ఆదాయాలు మరింతగా పెరగగలవని భావిస్తున్నాయి. -
డిసెంబర్ నాటికి స్పెక్ట్రమ్ వేలం: సిబల్
న్యూఢిల్లీ: తదుపరి స్పెక్ట్రమ్ వేలం డిసెంబర్ ఆఖరు నాటికి జరిగే అవకాశం ఉందని టెలికం మంత్రి కపిల్ సిబల్ చెప్పారు. దీనికి సంబంధించి రిజర్వ్ ధర.. క్రితం విడత రేటు కన్నా మరింత తక్కువగా ఉండొచ్చని పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఐఏ) కార్యక్రమం సందర్భంగా సిబల్ ఈ విషయాలు తెలిపారు. స్పెక్ట్రమ్ వేలం అంశంపై అంతర్ మంత్రిత్వ శాఖల బృందం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. తమ శాఖ అభిప్రాయాలను సాధికారిక మంత్రుల బృందానికి(ఈజీవోఎం) నివేదిస్తామని, ఈజీవోఎం సిఫార్సులపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని సిబల్ వివరించారు. రిజర్వ్ ధరను 62% దాకా తగ్గించాలన్న సిఫార్సులపై మరింత స్పష్టత ఇవ్వాలంటూ ట్రాయ్‌కి టెలికం కమిషన్ సూచించింది. టెలికం కమిషన్ ఈ నెల 29న మళ్లీ భేటీ కానుంది. స్పెక్ట్రమ్ వేలం రిజర్వ్ ధరను తగ్గించినా.. ఇప్పటికీ ప్రపంచ దేశాలతో చాలా ఎక్కువగానే ఉందని సీవోఏఐ అంటోంది.