డిసెంబర్ నాటికి స్పెక్ట్రమ్ వేలం: సిబల్
న్యూఢిల్లీ: తదుపరి స్పెక్ట్రమ్ వేలం డిసెంబర్ ఆఖరు నాటికి జరిగే అవకాశం ఉందని టెలికం మంత్రి కపిల్ సిబల్ చెప్పారు. దీనికి సంబంధించి రిజర్వ్ ధర.. క్రితం విడత రేటు కన్నా మరింత తక్కువగా ఉండొచ్చని పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఐఏ) కార్యక్రమం సందర్భంగా సిబల్ ఈ విషయాలు తెలిపారు.
స్పెక్ట్రమ్ వేలం అంశంపై అంతర్ మంత్రిత్వ శాఖల బృందం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. తమ శాఖ అభిప్రాయాలను సాధికారిక మంత్రుల బృందానికి(ఈజీవోఎం) నివేదిస్తామని, ఈజీవోఎం సిఫార్సులపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని సిబల్ వివరించారు. రిజర్వ్ ధరను 62% దాకా తగ్గించాలన్న సిఫార్సులపై మరింత స్పష్టత ఇవ్వాలంటూ ట్రాయ్‌కి టెలికం కమిషన్ సూచించింది. టెలికం కమిషన్ ఈ నెల 29న మళ్లీ భేటీ కానుంది. స్పెక్ట్రమ్ వేలం రిజర్వ్ ధరను తగ్గించినా.. ఇప్పటికీ ప్రపంచ దేశాలతో చాలా ఎక్కువగానే ఉందని సీవోఏఐ అంటోంది.