న్యూఢిల్లీ: భారత సర్కారు చేపడుతున్న వరుస సంస్కరణలను అమెరికా రేటింగ్స్ సంస్థ మూడీస్ ఎట్టకేలకు గుర్తించింది. భారత సౌర్వభౌమ రేటింగ్‌ను బీఏఏ3 నుంచి బీఏఏ2కు పెంచుతూ మోదీ సర్కారుకు ఊరట కల్పించింది. రేటింగ్ సంస్థలు ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణల్ని పట్టించుకోవడం లేదంటూ ప్రధాని మోదీ సహా పలువురు చేసిన విమర్శలకు మూడీస్ తన తాజా నిర్ణయంతో జవాబు ఇచ్చినట్టయింది. భారత్ విషయంలో తన దృక్పథాన్ని సానుకూలం నుంచి స్థిరత్వానికి సవరించింది. ఆర్థిక, సంస్థాగత సంస్కరణల విషయంలో క్రమానుగత పురోగతి వల్ల వృద్ధి అవకాశాలు మెరుగుపడ్డాయని మూడీస్ పేర్కొంది.
పెరిగిపోతున్న రుణ భారాన్ని నిలకడగా ఉంచేందుకు ఈ సంస్కరణలు తోడ్పడతాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. జీఎస్టీ అమలు, ద్రవ్యపరపతి విధాన కార్యాచరణ మెరుగుపరచడం, మొండి బకాయిల ప్రక్షాళనకు తీసుకున్న చర్యలను మూడీస్ ప్రస్తావించింది. బీఏఏ2 అంటే పెట్టుబడులకు సంబంధించి మోస్తరు క్రెడిట్ రిస్క్‌కు సూచిక. బీఏఏ3 అంటే పెట్టుబడులకు సంబంధించి అతి తక్కువ గ్రేడ్. చెత్త గ్రేడ్ కంటే ఓ మెట్టు పైన. మూడీస్ చివరిసారిగా 2004లో భారత సౌర్వభౌమ రేటింగ్‌ను సవరించింది. ఆ తర్వాత మార్పు చేయడం మళ్లీ ఇదే. గతేడాది మాత్రం భారత్ పట్ల తన వైఖరిని స్థిరత్వం నుంచి సానుకూలానికి మార్చింది.
ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన వ్యాపార సులభతర దేశాల సూచికలో భారత్ ఏకంగా 30 స్థానాలు మెరుగుపరుచుకుని 100వ స్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే మూడీస్ భారత రేటింగ్‌ను పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. మూడీస్ తాజా నిర్ణయం భారత దేశ ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్టర్లకు నమ్మకాన్ని పెంచుతుందని, విదేశీ పెట్టుబడులు పెరిగేందుకు దోహదం చేస్తుందని, కంపెనీలు, కేంద్ర సర్కారు సులభంగా రుణాల్ని సమీకరించుకోగలవని విశ్లేషకులు భావిస్తున్నారు.
రుణ భారం అవరోధమే...
భారత రేటింగ్‌ను పెంచు తూ మూడీస్ పలు అంశాలపై వ్యాఖ్యానించింది. ‘‘ఆర్థిక, సంస్థాగత సంస్కరణలతో భారత్‌కు వృద్ధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇవి ప్రభుత్వ రుణ భారాన్ని మధ్య కాలానికి క్రమంగా తగ్గుముఖం పట్టేలా చేస్తాయి. భారతదేశ అధిక రుణ భారం ఇప్పటికీ ఆ దేశ క్రెడిట్ ప్రొఫైల్‌కు అవరోధమే. అయితే, ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలు రుణభారం వేగంగా పెరిగిపోకుండా అడ్డుకుంటాయి. తగ్గముఖం పట్టేందుకూ అవకాశం లేకపోలేదు’’ అని మూడీస్ పేర్కొంది.
వచ్చే ఏడాది జీడీపీ 7.5 శాతం
దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతంగా ఉండొచ్చని మూడీస్ అంచనా వేసింది. 2016–17లో జీడీపీ 7.1 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. డీమోనిటైజేషన్, జీఎస్టీ స్వల్ప కాలంలో వృద్ధిని అడ్డుకున్నప్పటికీ 2018–19 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ రేటు 7.5 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. ‘‘చాలా ముఖ్యమైన సంస్కరణలు ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు అమలు చేసిన సంస్కరణలు వ్యాపార వాతావరణం మెరుగుపడాలన్న ప్రభుత్వ దృక్పథాన్ని ముందుకు తీసుకెళతాయి.
అలాగే, ఉత్పాదకతను, దేశ, విదేశీ పెట్టుబడులను పెంచుతాయి. అంతిమంగా బలమైన, స్థిరమైన వృద్ధి సాధ్యపడుతుంది’’ అని ఈ అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అకౌంటింగ్ విధానం, లబ్దిదారులకు నేరుగా ప్రయోజనం బదిలీతో వ్యవస్థలో అక్రమాలకు చెక్ పడుతుందని అభిప్రాయపడింది. డీమోనిటైజేషన్, జీఎస్టీ చర్యల ద్వారా ఆర్థిక కార్యకలాపాలను అధికారికం చేయడం, అవినీతిని తగ్గించడం, పన్ను వసూళ్లను పెంచడం వంటి ప్రభుత్వ నిర్ణయాలు దేశ వ్యవస్థలను బలోపేతం చేస్తాయని పేర్కొంది. ప్రైవేటు పెట్టుబడులు బలహీనంగా కొనసాగుతూ ఉండటం, జీఎస్టీ అమలు, బ్యాంకింగ్ రంగ ఆస్తుల నాణ్యత మెరుగుపరచడం, కార్మిక, భూ సంస్కరణల్లో పురోగతి లేకపోవడం వంటివి సవాళ్లుగా మూడీస్ పేర్కొంది.
పెట్టుబడులకు హితోధికం!
మూడీస్ భారత దేశ సౌర్వభౌమ రేటింగ్‌ను పెంచడం ద్వారా ఇటలీ, స్పెయిన్, బల్గేరియా, ఫిలిప్పీన్స్ దేశాల సరసన భారత్‌ను నిలబెట్టింది. చైనాకు మూడు స్థానాల దగ్గరకు చేరుకోగలిగింది. బ్రిక్స్ దేశాల్లో చైనా తర్వాత రెండో స్థానం భారత్‌దే. బీఏఏ2 రేటింగ్ కలిగిన దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్‌దేనని మూడీస్ తెలిపింది.
రేటింగ్ పెంపుతో కంపెనీల విస్తరణ ప్రణాళికలకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్టాక్స్, బాండ్లు, కరెన్సీ మార్కెట్లలోకి మరిన్ని నిధులు వచ్చిపడతాయి. మూడీస్ నిర్ణయం దరిమిలా మరో రెండు ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఫిచ్, ఎస్‌అండ్‌పీ కూడా మన రేటింగ్‌ను సవరించే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం భారత సౌర్వభౌమ రేటింగ్‌ను ఈ రెండు సంస్థలు కూడా బీబీబీ(మైనస్) గానే కొనసాగిస్తున్నాయి.
ఓఎన్‌జీసీకి టాప్ రేటింగ్
మన దేశానికి చెందిన నాలుగు ఆర్థిక సంస్థలతోపాటు, ప్రభుత్వరంగ కంపెనీల రేటింగ్‌ను మూడీస్ పెంచింది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ)ల దీర్ఘకాలిక రేటింగ్‌ను బీఏఏ3 నుంచి బీఏఏ2కు మార్చింది. భారత సార్వభౌమ రేటింగ్‌ను మించి ఓఎన్‌జీసీ బీఏఏ1 రేటింగ్‌ను దక్కించుకుంది. ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీల విదేశీ కరెన్సీ జారీ రేటింగ్‌ను బీఏఏ2కు పెంచింది. అలాగే, ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌హెచ్‌ఏఐ, గెయిల్‌లకూ ఇదే రేటింగ్ దక్కింది.
ఇతర ఏజెన్సీలు ఇదే బాటలో: నీతి ఆయోగ్
మూడీస్ నిర్ణయం దేశ ఆర్థిక వృద్ధిని ప్రతిఫలిస్తోందని, ఇతర ఏజెన్సీలు మూడీస్ బాటలో నడిచి రేట్లను పెంపు చేస్తాయన్న ఆశాభావాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
శుభ పరిణామం ఇది: కార్పొరేట్లు, బ్యాంకర్లు
రేటింగ్ పెంపు నిర్ణయాన్ని బ్యాంకర్లు, కార్పొరేట్లు శుభసూచికంగా పేర్కొన్నాయి. రుణ సమీకరణ వ్యయాలను ఇది తగ్గిస్తుందని, విదేశీ నిధుల రాకను పెంచుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇది సానుకూలం. ఫైనాన్షియల్ మార్కెట్లకు మేలు చేస్తుంది. బాండ్ల రాబడులు, రూపాయి, స్టాక్ మార్కెట్లు ఇప్పటికే సానుకూలంగా స్పందించాయి. ప్రభుత్వం, ఆర్థిక సంస్థల రుణాల సమీకరణ వ్యయాల్ని తగ్గిస్తుంది. దేశ వృద్ధి, సంస్కరణలపై పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుంది. – రజనీష్‌కుమార్, ఎస్‌బీఐ చైర్మన్
మోదీ సర్కారు అమలు చేసిన నిర్మాణాత్మక సంస్కరణలకు తగిన గుర్తింపు ఇది. కేంద్ర ప్రభుత్వానికి, దేశ కార్పొరేట్ రంగానికి ఇది చాలా సానుకూలమైన చర్య. రుణ సమీకరణ వ్యయాలు తగ్గుతాయి. కార్పొరేట్లకు తక్కువ వ్యయాలకే నిధులు లభిస్తాయి. – చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో
రేటింగ్ ఏజెన్సీలు విశ్లేషించడానికి సమయం తీసుకుంటుంటాయి. కనుక ఇది ఆలస్యం అయింది. అయితే, రేటింగ్ ఏజెన్సీలు భారత్ విషయంలో న్యాయబద్ధంగా ఉండడం లేదన్నది నా భావన. ఎందుకంటే ముఖ్యంగా గత ఏడాదిన్నర కాలంలో ఎన్నో విప్లవాత్మక, భారీ సంస్కరణలను ప్రభుత్వం అమలు చేసింది. ఈ కోణంలోంచి చూస్తే రేటింగ్ పెంపు ముందే చేయాల్సి ఉం
– దీపక్ పరేఖ్, హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్
రేటింగ్‌ను బీఏఏ2కు పెంచడం వల్ల విదేశీ నిధులు రాక సహా పెట్టుబడులు పుంజుకుంటాయి. ప్రభుత్వ సంస్కరణలకు ఆమోదం. ఇది ఎప్పుడో చేయాల్సింది.
– అజయ్ త్యాగి, సెబీ చైర్మన్
రేటింగ్‌ను పెంపొదించడం, వ్యాపార సులభతర సూచీలో స్థానం మెరుగపడడం అన్నవి మనం సరైన దిశలోనే వెళుతున్నామనేదానికి నిదర్శనం. దేశ వృద్ధి అన్నది ఇంతకుముందు ఎన్నడూ లేనంత ఆశావహంగా ఉందిప్పుడు. – పంకజ్ పటేల్, ఫిక్కి ప్రెసిడెంట్
మూడీస్ చర్య విదేశీ మార్కెట్లో మరింత పోటీ రేట్లకే రుణాల సమీకరణకు వీలు కల్పిస్తుంది. దీంతో దేశీ కంపెనీలు మరిన్ని విదేశీ నిధులను ఆకర్షించగలవు. ఇతర ఏజెన్సీలూ రేటింగ్‌ను పెంచుతాయని భావిస్తున్నాం. – చంద్రజిత్‌బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్
Comments
Please login to add a commentAdd a comment