సాక్షి,న్యూఢిల్లీ: అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం మూడీస్ భారత్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడంపై మోదీ సర్కార్, బీజేపీ సంబరాల్లో మునిగితేలాయి. అయితే మూడీస్ రేటింగ్ మార్పు ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందా..? గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి కలిసివస్తుందా..? అనే కోణంలో నిపుణుల మాట భిన్నంగా ఉంది. మూడీస్ రేటింగ్ సవరణ చిన్న అంశమని, దీనికి ఓటర్లు,ఎన్నికలతో ఏ మాత్రం సంబంధం లేదన్నది వారి అంచనాగా ముందుకొస్తోంది. మూడీస్ చర్య అటు కార్పొరేట్లకూ, ఇటు ఆర్థిక వృద్ధికీ దీర్ఘకాలంలో ఉపకరించేంది కాదనే విశ్లేషణలు సాగుతున్నాయి. భారత రేటింగ్ అప్‌గ్రేడ్‌తో కంపెనీలకు రుణ పరపతి కొంత మేర పెరిగి మార్కెట్లకు స్వల్పకాలంలో ఊతమిచ్చే చర్యగా నిపుణులు పేర్కొంటున్నారు.
ఇది దీర్ఘకాలంలో దేశానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు పనికొస్తుందనే దానిపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన క్రమంలో మూడీస్ ఏ ప్రాతిపదికన రేటింగ్ అప్‌గ్రేడ్ చేసిందనే చర్చకు తెరలేచింది. అయితే స్వల్ప కాలిక ప్రభావాలను రేటింగ్ ఏజెన్సీలు పరిగణనలోకి తీసుకోవని నిపుణులు పేర్కొంటున్నారు.
పెరుగుతున్న రుణ భారాన్ని సమర్థంగా మోదీ సర్కార్ ఎదుర్కోగలదనే విశ్వాసం మూడీస్ కనబరచడం మరో విశేషాంశంగా చెబుతున్నారు. సబ్సిడీలు, ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేరవేయడం, ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన కేటాయింపులు పెంచి రుణ వితరణకు ఊతం కల్పించడం, గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల పెంపు వంటి కేంద్ర నిర్ణయాలు కొంత మేర రేటింగ్ ఏజెన్సీని ప్రభావితం చేశాయని నిపుణులు చెబుతున్నారు.
అన్నీ బాగున్నా...
భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నా మోదీ ఎన్నికల వాగ్ధానాల్లో ప్రధానమైన ఉపాథి కల్పన దిశగా ఇప్పటికీ అడుగులు పడలేదు. అవసరమైన నైపుణ్యాలతో కూడిన సిబ్బంది కంపెనీలకు అందుబాటులో లేదు. ఏటా లక్షలాది గ్రాడ్యుయేట్లు జాబ్ మార్కెట్లోకి వస్తున్నా నైపుణ్యాల లేమితో కొలువులు దక్కే పరిస్థితి లేదు. ప్రభుత్వ శాఖలన్నింటిలో అవినీతిని నియంత్రించే వ్యవస్థ సమర్థంగా లేకపోవడంతో పాటు పాలనా సంస్కరణలు కొరవడ్డాయి. భారీ మౌలిక ప్రాజెక్టులు పట్టాలెక్కి దశాబ్దాలు గడుస్తున్నా పూర్తికాని పరిస్థితి.
రద్దుల పద్దు..
బ్యాంకుల మొండిబకాయిలు రూ పదిలక్షల కోట్లు దాటి పరుగులు పెడుతున్నా రికవరీ ఆశించిన మేర సాగడం లేదు. దివాలా చట్టాలకు పదును పెట్టినా రుణ వసూళ్లు మందకొడిగానే ఉన్నాయి. జీఎస్‌టీ, నోట్ల రద్దుతో చిన్న పరిశ్రమలు మూత పడి ఉపాథి రంగం దెబ్బతింది. ఇన్ని ప్రతికూలతలున్నా సంస్కరణల వేగం, ప్రభుత్వ సానుకూల ధోరణితో మూడీస్ రేటింగ్ మెరుగుదలకు మొగ్గుచూపింది.
పటిష్ట ఆర్థిక వృద్ధి దిశగా మూడీస్ నిర్ణయం స్వాగతించదగినదే అయినా అసమానతలు,అవినీతిని రూపుమాపే దూకుడు చర్యలతో ముందుకెళ్లకుంటే మున్ముందు అధిక వృద్ధి అసాధ్యమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment