రేటింగుల మత్తులో మోదీ | ABK Prasad writes on Modi and moody's ratings | Sakshi
Sakshi News home page

రేటింగుల మత్తులో మోదీ

Published Tue, Nov 28 2017 2:25 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

ABK Prasad writes on Modi and moody's ratings - Sakshi

దేశాల ఆర్థిక ప్రగతి విషయంలో ప్రకటించే మదింపు (రేటింగ్‌) ప్రమాణాల్ని, అభిప్రాయాల్ని చూసి బయట రుణాలు మంజూరవుతాయన్న గ్యారంటీ లేదని కూడా ఈ ఏజెన్సీలు ప్రకటించాయి. ఎందుకంటే, ఎవరి గుట్టు మట్టులు వారికే ఎరుక. నోట్ల రద్దు చర్యవల్ల దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుందన్న మోదీ ఆశ ‘దింపుడుకళ్లం ఆశ’. నోట్ల రద్దుపైన ఖర్చు దీర్ఘకాలంలో వచ్చే లాభాలని మించిపోతుంది కాబట్టి రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ రాజన్‌ వ్యంగ్యంగా ఆ విధంగా వ్యాఖ్యానించాల్సి వచ్చింది.

పెద్ద నోట్ల రద్దు, వస్తు–సేవల పేరిట ప్రత్యక్ష, పరోక్ష పన్నులను మోపడంవల్ల సంఘటిత ఆర్థిక రంగంతో ముడిపడి ఉన్న అసంఘటిత రంగానికి అపారమైన నష్టం వాటిల్లింది. ఫలితంగా ఆర్థికరంగ అభివృద్ధి దెబ్బతిన్నది. నల్లధనం మీద జరుపుతానని మోదీ ప్రభుత్వం చెప్పిన దాడి వెనుకడుగు పట్టి, నోట్ల రద్దు నిర్ణయం కాస్తా, అసంఘటిత ఆర్థిక రంగాన్ని సర్వ విధ్వంసం (కార్పెట్‌ బాంబింగ్‌) చేసే దిశగా సాగింది. ఫలితంగా సువిశాల ఆర్థిక వ్యవస్థకు ప్రాణవాయువు వంటి అసంఘటిత రంగాన్ని, కోట్లాదిమంది భారత ప్రజల జీవితాలకు ఆయువుపట్టయిన రంగాన్ని చావు దెబ్బ తీసింది. భారత శ్రమజీవులలో నూటికి 80–90 శాతం మందికి జీవనాధారం అసంఘటిత రంగమే. మొత్తం దేశ జాతీయోత్పత్తులు 40–50 శాతం ఈ శ్రామికుల భాగస్వామ్యంతోనే జరుగుతాయని మరవరాదు. కానీ మోదీ ఆయన అనుయాయుల మాటలు వింటుంటే అసంఘటిత రంగం పరాన్నభుక్కులతో నిండి ఉందనిపిస్తుంది. ఈ రంగమంతా నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ పన్నులు ఎగవేస్తూంటుంది కాబట్టి ఈ అసంఘటిత శ్రామిక వర్గాన్ని పన్నుల పరిధిలోకి లాక్కురావాలి. – సల్మాన్‌ అనీజ్‌ సోజ్‌(9–11–17), ప్రపంచ బ్యాంక్‌ మాజీ ఉన్నతాధికారి

ఇంత బాగోతం నేపథ్యంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఏ ‘అండ’ చూసుకుని ఈరోజు దాకా కూడా నోట్ల రద్దునూ, జీఎస్‌టీ భారాన్నీ సమర్ధిస్తున్నారు? ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులతో పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఆర్థికాభివృద్ధి రేట్లను ‘సవరించ’డానికి అలవాటుపడిన అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు బతికి ఉన్నంత కాలం అవి పాలకులకు రక్షణకవచాలుగానే ఉంటాయి. ప్రపంచ కార్పొరేట్‌ వర్గాల ‘ఎత్తు బిడ్డల’మాదిరిగా దేశాల వృద్ధి రేట్ల విషయంలో తిమ్మిని బ్రహ్మిని చేసి చూపడం కూడా ఈ ఏజెన్సీలకు అలవాటే. ఈ అండతోనే నరేంద్ర మోదీ సైబర్‌ స్పేస్‌కు సంబంధించిన ప్రపంచ సభలో(23–11–17) కొన్ని చిత్రమైన ఆణిముత్యాలను వల్లించారు, ‘సాంకేతిక పరిజ్ఞానాన్నీ, ఈ పరిజ్ఞానం సాయంతో నడుస్తున్న పద్దులను, బయో మెట్రిక్, ఆధార్‌ సాధనాల సాయంతో నేరుగానే సౌకర్యాలు పొందే అవకాశం ప్రభుత్వం కల్పించింది. వాటి ఫలితంగానే సౌకర్యాల బదలాయింపులో లోటుపాట్లను సరిచేయడం వల్ల సబ్సిడీలలో 10 బిలియన్‌ డాలర్లు ఆదా అయ్యా’యని ప్రకటించారాయన. కానీ మోదీ ఉపన్యాసం ముగిసిన కొద్దిగంటలకే పేదసాదలకు అందించే రాయితీలకు కోతపెట్టి, 10,15 బడా కార్పొరేట్‌ సంస్థలు చెల్లించాల్సిన రూ. 6 లక్షల కోట్ల బకాయిలను రద్దు చేయనున్నట్టు (ఈ నెల 25న) వార్తలు వెలువడినాయి. ఈ సమయంలోనే దూసుకువచ్చాయి అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు మూడీస్, స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్, ఫిట్జ్‌. ఇవి అమెరికాకు డూడూ బసవన్నలుగా వ్యవహరిస్తూ ఉంటాయి. తమ గుత్త పెట్టుబడివర్గాల పెట్టుబడులను భారతదేశంలోకి మరింతగా గుప్పించడానికి వాతావరణాన్ని సానుకూలం చేశాయి.

ఆ మాటల వెనుక...
నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణం చేసిన తరువాత జరిపిన తొలి విదేశీ పర్యటన, అక్కడ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకోవాలి. తన విదేశీ పర్యటనలో భాగంగానే అమెరికా తదితర పెట్టుబడిదారీ దేశాలను సందర్శించి ఆయన ఈ మాటలు అన్నారు. ‘మీరంతా వాస్కోడిగామాలై తరలివచ్చి భారతదేశంలో పెట్టుబడులు పెట్టమ’ని ఆహ్వానించారాయన. సులభంగా వ్యాపారాలు చేసుకోవడానికి ఇండియా తలుపులు తెరిచి ఉంచుతుందని కూడా భరోసా ఇచ్చారు. మేక్‌ ఇన్‌ ఇండియా అంటే ఇక నుంచి విదేశాల మీద ఆధారపడకుండా భారతదేశంలోనే వస్తూత్పత్తి అంతా జరుగుతుందని భ్రమ కల్పించారు. కానీ ఆచరణలో దాని అర్థం మారిపోయింది. మేక్‌ ఇన్‌ ఇండియా అంటే విదేశీ కంపెనీలే ఇండియాలో వస్తూత్పత్తి చేసి పెట్టడమే దాని అర్థంగా మారిపోయింది. వీటి తరువాత మన పాలకుల ఆలోచన ఏ దశకు చేరుకుంది? నోట్ల రద్దు, జీఎస్‌టీ నిర్ణయాలతో దేశ జాతీయోత్పత్తి కాస్తా రెండు శాతానికి పడిపోయింది. కోట్ల సంఖ్యలో ప్రజలు ఉపాధి కోల్పోయారు. పరపతి వినియోగం గత 65 ఏళ్లుగా ఎన్నడూ లేనంత స్థాయికి దిగజారింది. సరుకుల ఉత్పత్తి కునారిల్లింది. వాణిజ్య లోటు పెరిగింది. దేశంలో ఇన్ని విష పరిణామాలు జరుగుతుండగా పైన పేర్కొన్న రేటింగ్‌ ఏజెన్సీల ప్రకటనలు ఏ ప్రలోభమూ లేకుండా వచ్చాయని ఎలా నమ్మేది? ఆంగ్లో, అమెరికన్‌ గుత్త పెట్టుబడులు అనుకున్న స్థాయిలో భారతదేశంలోకి ప్రవేశించేం దుకు ఇంతకు ముందులేని రేటింగ్‌ను ఈ సంస్థలు పెంచుతూ ఉంటాయి. లేదా తగ్గిస్తూ ఉంటాయి. ఇంకా సిగ్గుచేటైన విషయం కూడా ఉంది. అమెరికాలోని గుత్త సంస్థ లెహ్మాన్‌ బ్రదర్స్‌ దారుణంగా పతనమైంది. అక్కడితో ఆగలేదు. అది 2008 నాటి అమెరికా ఆర్థిక సంక్షోభానికి దోహదం చేసింది. నాటి అమెరికా సంక్షోభ ఛాయలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మీద ప్రభావం చూపాయన్న విషయాన్ని మరచిపోకూడదు.

పరస్పర విరుద్ధ రేటింగ్‌లు
అమెరికా ప్రజలలో భ్రమలు కల్పించడం ద్వారా, సానుకూలమైనప్పుడు పతనమయ్యే సంస్థలకు కూడా రేటింగ్స్‌ పెంచడమూ, ప్రతికూలత ఉంటే కోత పెట్టడమూ ఆ మూడు రేటింగ్‌ సంస్థలకూ (మూడీస్, స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్, ఫిట్జ్‌) కూసువిద్యేనని గ్రహించాలి. ప్రభుత్వ అధికారులతో సమావేశాల తర్వాతనే ‘మూడీస్‌’ మన ఆర్థిక ప్రగతి రేటింగ్‌ను నవంబర్‌ రెండో వారంలో ఆకస్మికంగా పెంచింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ‘స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌’ కూడా రంగంలోకి దిగి, మోదీ ఆర్థిక రంగ సంస్కరణలకు అనుకూలత ప్రకటించింది. అయినా పెట్టుబడులు పెట్టడానికి నేడున్న పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థను మదింపు వేయడంలో అత్యంత అథమ స్థాయి రేటింగ్‌ను (బీబీబీ) మాత్రం పెంచడానికి అది నిరాకరించడం గమనార్హం.

ఈ రేటింగ్స్‌ను ఎలా నమ్మగలం?
కాబట్టి ఇలాంటి పాక్షిక దృష్టితో, స్వలాభాపేక్షే ధ్యేయంగా బడుగు దేశాల ఆర్థిక వ్యవస్థలను మదింపు చేసే అంతర్జాతీయ పెట్టుబడి రేటింగ్‌ ఏజెన్సీలను ఎలా నమ్మగలం? ఈ విషయంలో జరిగిన పెద్ద నాటకాన్ని ‘ది హిందూ’ నివేదిక (23.11.17) బయట పెట్టింది: ‘గత 20 ఏళ్లుగా ఇటు భారత ప్రభుత్వమూ, అటు మూడీస్‌ ఏజెన్సీ ఈ రేటింగ్స్‌ నిర్ణయించే అంశం మీద సిగపట్లు పడుతున్నాయి. కానీ గత 13 ఏళ్లలో మూడీస్‌ భారత ఆర్థిక ప్రగతి రేటును అనుకూలంగా పెంచి చూపడం ఇదే మొదటిసారి’. అది కూడా ఎప్పుడు? మన ఆర్థిక రంగం బీజేపీ పాలనా పద్ధతులవల్ల నిలకడను కోల్పోతున్న దశలో, ముఖ్యంగా నోట్ల రద్దు, భారీ ప్రత్యక్ష పన్నులకు దారి తీసిన జీఎస్‌టీ వ్యవస్థ మూలంగా! ఈ సందర్భంగా, ఈ ‘రేటింగ్‌ ఏజెన్సీలను మీరు ఎందుకు నమ్మకూడదు’ అని సుప్రసిద్ధ విశ్లేషకుడు రియాన్‌ సి. ఫర్మాన్‌ (5.10.17) ఒక అంచనా ఇచ్చారు: ‘ఈ రేటింగ్‌ ఏజెన్సీలు కార్పొరేషన్లకూ, ప్రభుత్వ సంస్థలకూ అనుకూలంగా ఇచ్చే రేటింగ్స్‌ పైన ఒకటి కాదు, తీవ్రమైన ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ విమర్శ ఈమధ్య కాలంలో మరింత పెరిగింది. పైగా ఇటీవల సంవత్సరాలలో ‘స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌’ రేటింగ్‌ ఏజెన్సీ అమెరికా వృద్ధి రేటును అత్యున్నత రేటింగ్‌ స్థాయి నుంచి దిగజార్చిన తర్వాత విమర్శ మరింత పెరిగింది’ అని రాశాడు.

అంతేకాదు, రేటింగ్‌ ఏజెన్సీల మదింపు పద్ధతిని పెట్టుబడులు పెట్టే సంస్థలు నమ్మరాదని మరొక వాదన. ఎందుకంటే పెట్టుబడిదారులు రేటిం గ్స్‌ను తమకు అనుకూలంగా తెప్పించుకోవడానికి ప్రయత్నిస్తారని విమర్శకుల విశ్వాసం. ఇందుకు ఉదాహరణగా ప్రపంచస్థాయి ఇంధన పారిశ్రామిక సంస్థ ‘ఎన్రాన్‌’ను పేర్కొంటారు. అది భారీ రుణగ్రస్థ సంస్థగా మారి దివాలా ఎత్తింది.
మరో గమ్మత్తు లేదా మోసం ఏమంటే– తాము దేశాల ఆర్థిక ప్రగతి విషయంలో ప్రకటించే మదింపు (రేటింగ్‌) ప్రమాణాల్ని, అభిప్రాయాల్ని చూసి బయట రుణాలు మంజూరవుతాయన్న గ్యారంటీ లేదని కూడా ఈ రేటింగ్‌ ఏజెన్సీలు ప్రకటించాయి. ఎందుకంటే, ఎవరి గుట్టు మట్టులు వారికే ఎరుక. నోట్ల రద్దు చర్యవల్ల దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుందన్న మోదీ ఆశ ‘దింపుడుకళ్లం ఆశ’. నోట్ల రద్దుపైన ఖర్చు దీర్ఘకాలంలో వచ్చే లాభాలని మించిపోతుంది కాబట్టి రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ రాజన్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాల్సి వచ్చింది.

గుప్తధనం... అంతే సంగతులు
అన్నట్టు, స్విస్‌ బ్యాంక్‌లోని వందలాదిమంది భారత కుబేర వర్గాల ఖాతాలు గానీ, పనామా పేపర్స్, ప్యారడైజ్‌ పేపర్స్‌లో దాక్కున్న గుప్తధనాన్ని గానీ మోదీ ప్రభుత్వం రాబట్టగలదన్న విశ్వాసమూ భారత ప్రజలకు లేదు. ఎందుకని? అటు మాజీ కాంగ్రెస్‌ పాలకులుగానీ, ఇటు నేటి బీజేపీ పాలకులుగానీ, కుబేర వర్గాలుగానీ ఇంటా బయటా గుట్టుగా దాచుకుని పొదుగుతున్న నల్లధనాన్ని స్వచ్ఛందంగా ప్రజలపరం చేస్తారని కలలోకూడా ఊహించరాదు. ఎక్కడో ఖండాంతరాలలో ఉన్న ‘దేశవాళీ పెద్దల’ గుప్తధనం మాట అటుంచి, కనీసం దేశీయ బ్యాంకులకు బడా కార్పొరేట్లు చెల్లించకుండా ఎగ్గొట్టిన రూ. 9.24 లక్షల కోట్లను వసూలు చేసుకుని బ్యాంకులకు తిరిగి జమకట్టగల దమ్ములున్న నాయకుల కోసం దేశ ప్రజలింకా ఎదురుచూడవలసే ఉంది. ట్రంప్‌తోనూ నానా ‘కంపు’తోనూ చెట్టపట్టాలు కట్టే నాయకులున్నంతకాలం, అందుకోసం ఇరుగుపొరుగు దేశాలతో మైత్రీ సంబంధాల ద్వారా పటుతరమైన వర్తక, వాణిజ్య వార«థులు నిర్మించుకోనంత కాలం, శాంతియుత సహజీవనాన్ని, సెక్యులర్‌ వ్యవస్థ పటిష్టతను కాపాడుకోనంతవరకూ– ఈ రాజ్యం అంబానీలదీ, ‘ఆదానీ’లదీ, అమెరికన్‌ వలస సామ్రాజ్య పాలకుల రేటింగ్‌ వ్యవస్థలదిగానే ఉండిపోతుంది!


- ఏబీకే ప్రసాద్‌

సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement