పసిడి నాణేల విక్రయాల పెంపుపై దృష్టి
ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, పోస్టాఫీసులతో ఒప్పందాలకు ఎంఎంటీసీ కసరత్తు
చండీగఢ్: పసిడి డిపాజిట్ పథకంలో భాగంగా ఉన్న ఇండియన్ గోల్డ్ కాయిన్ల విక్రయ మార్కెటింగ్ నెట్‌వర్క్ పటిష్టతపై ఎంఎంటీసీ దృష్టి సారించింది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఐసీఐసీఐ బ్యాంకులతో పాటు ఇండియా పోస్ట్‌తో ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు ఎంఎంటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ వేద్ ప్రకాశ్ శుక్రవారం ఇక్కడ పేర్కొన్నారు. ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామని, రెండు వారాల్లో ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం తక్షణం నాణేల అమ్మకానికి దేశ వ్యాప్తంగా 100 నుంచి 150 బ్రాంచీలు ఖరారయ్యే అవకాశం ఉందని వివరించారు.
తరువాత అమ్మకానికి సంబంధించిన బ్రాంచీల పెంపుపై కూడా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం సంస్థ 22 ఔట్‌లెట్ల ద్వారా ‘ఇండియన్ గోల్డ్’కాయిన్ల రిటైల్ విక్రయాలు నిర్వహిస్తోంది. నాణేల విక్రయానికి పంజాబ్ స్మాల్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ కార్పొరేషన్‌తో ఒక అవగాహన కుదుర్చుకున్నట్లు కూడా శుక్రవారం సంస్థ తెలిపింది. 24 క్యారట్ల ప్యూరిటీ ఇండియన్ గోల్డ్ కాయిన్ ఒకవైపు అశోకచక్రను కలిగిఉండగా, మరోవైపు మహాత్మాగాంధీ బొమ్మను ముద్రించడం జరిగింది. 5, 10, 20 గ్రాముల్లో తొలిదశల్లో ఈ కాయిన్లు లభ్యమవుతున్నాయి.