మరింత తగ్గిన బంగారం
♦ ముంబైలో నాలుగేళ్ల కనిష్టం
♦ రూ.25,000 దిగువకు 10 గ్రా. పసిడి
ముంబై/న్యూయార్క్ : అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా దేశంలో బంగారం ధర తగ్గుతోంది. ముంబై ప్రధాన స్పాట్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.300 తగ్గి, రూ. 24,970కి చేరింది. 22 క్యారెట్ల ఆభరణాల ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ. 24,820కి పడింది. ధరలు ఇక్కడ ఈ స్థాయికి తగ్గడం నాలుగేళ్లలో ఇదే తొలిసారి. వరుసగా మూడు రోజుల నుంచీ బంగారం ధర కిందకు జారుతోంది.
అంతర్జాతీయంగా 10 రోజుల నుంచి డౌన్
అంతర్జాతీయంగా చూస్తే... పసిడి ధర వరుసగా 10 రోజల నుంచి పతనం అవుతోంది. 1996 తరువాత వరుసగా 10 రోజులు బంగారం ధర ప్రపంచ మార్కెట్‌లో పడడం ఇదే తొలిసారి. బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని దిగ్గజ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ- గోల్డ్‌మన్ శాక్స్ అంచనావేస్తోంది. ఇన్వెస్టర్లు ఫండ్స్ ద్వారా మరింత బంగారం అమ్మకాలకు పాల్పడే అవకాశం ఉందని సంస్థ అంచనా వేస్తోంది. అంతర్జాతీయంగా నెమైక్స్ కమోడిటీ డివిజన్‌లో పసిడి ధర ప్రస్తుతం ఔన్స్ (31.1 గ్రా)కు 1,100 డాలర్ల దిగువనే కొనసాగుతోంది. మరో 100 డాలర్లు తగ్గి, 1,000 డాలర్లకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు విశ్లేషకుల అంచనా. 2009 తరువాత పసిడి ఈ స్థాయికి జారలేదు.
వెండి విషయానికి వస్తే..: అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ఔన్స్ ధర 15 డాలర్ల లోపే ట్రేడవుతోంది. ముంబై మార్కెట్‌లో కేజీ ధర రూ.35,000కు కొంచెం అటుఇటుగా ఉంటోంది. కారణాలు ఏమిటి..: అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచవచ్చన్న ఊహాగానాలు అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ట్రేడర్లు భారీ అమ్మకాలకు తెగబడుతుండడం బంగారం నేల చూపుకు కారణమని కొన్ని వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా అంతర్జాతీయం గా, ఇటు దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్‌లో బుధవారం కడపటి సమాచారం అందేసరికి పసిడి భారీ నష్టాలో ్లనే ట్రేడవుతోంది. ఇదే పరిస్థితి ట్రేడింగ్ చివరికంటా కొనసాగితే... గురువారం దేశీయ స్పాట్ మార్కెట్‌లో కూడా పసిడి ధర మరింత పడే అవకాశం ఉంది.