పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ తాజాగా రిలయన్స్ రిటైల్ బిజినెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. సూపర్ మార్కెట్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ తదితర విభాగాలలో రిలయన్స్ రిటైల్ దేశవ్యాప్తంగా 12,000 సోర్లను నిర్వహిస్తోంది. సుమారు 7,000 పట్టణాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఇటీవల జియోమార్ట్ ద్వారా ఆన్‌లైన్ గ్రోసరీ స్టోర్‌ను సైతం ప్రారంభించింది. 2020 మార్చికల్లా రిలయన్స్ రిటైల్ రూ.1.63 ట్రిలియన్ల ఆదాయాన్ని సాధించినట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. కాగా.. కొద్ది రోజులుగా రిలయన్స్ రిటైల్ బిజినెస్‌పైనా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి వ్యక్తమవుతున్నట్లు తాజా ఏజీఎంలో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇకపై రిలయన్స్ రిటైల్‌లో వాటా విక్రయం లేదా వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ముకేశ్ అంబానీ తెరతీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
పెట్రోకెమికల్స్ సైతం
పెట్రోకెమికల్స్ విభాగంలో సైతం వాటా విక్రయం, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ఇకపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందడుగు వేసే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే సౌదీ అరామ్‌కోతో డీల్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడంలేదని బుధవారం జరిగిన 43వ ఏజీఎంలో ముకేశ్ తెలియజేశారు. దీంతో తిరిగి విదేశీ ఇంధన దిగ్గజాలతో చర్చలు ప్రారంభించే వీలున్నట్లు ఊహిస్తున్నాయి. అయితే సౌదీ అరామ్‌కోతో దీర్ఘకాలిక భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లు ముకేశ్ పేర్కొనడం గమనార్హం! రానున్న రోజుల్లో రిలయన్స్ రిటైల్ బోర్డులోకి వ్యూహాత్మక ఇన్వెస్టర్లు అడుగు పెట్టనున్నట్లు ముకేశ్ పేర్కొన్న నేపథ్యంలో తాజా అంచనాలకు బలమొచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
20 బిలియన్ డాలర్లు
డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో మూడు నెలల్లోనే దాదాపు 33 శాతం వాటా విక్రయం ద్వారా సుమారు రూ.1.52 లక్షల కోట్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ సమకూర్చుకుంది. గ్లోబల్ దిగ్గజాలు ఫేస్‌బుక్, ఇంటెల్, గూగుల్ తదితరాలు ఇన్వెస్ట్ చేయడం విశేషంకాగా.. రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఎంటర్‌ప్రైజ్ విలువ 58 బిలియన్ డాలర్లకు చేరింది. జియోలో 7.7 శాతం వాటా కొనుగోలుకి గూగుల్ 4.5 బిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది. ఈ బాటలో ఆయిల్, కెమికల్స్ విభాగంలో సౌదీ అరామ్‌కోకు వాటా విక్రయించడం ద్వారా 15 బిలియన్ డాలర్లను సమకూర్చుకోవాలని ఆర్‌ఐఎల్ ఆశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో రిలయన్స్ రిటైల్ బిజినెస్‌తోపాటు.. ఆయిల్, కెమికల్ విభాగంలో విదేశీ పెట్టుబడులపై ముకేశ్ అంబానీ దృష్టిసారించవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment