న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్‌లో దూసుకుపోతున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో సంచలనం సృష్టించబోతున్నారు. జియోకాయిన్ పేరుతో సొంత క్రిప్టోకరెన్సీని సృష్టించాలని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్లాన్ చేస్తోంది. 50 మంది యంగ్ సభ్యుల టీమ్‌తో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై జియో పనిచేస్తుందని లైవ్‌మింట్ రిపోర్టు చేసింది. దీనికి అధినేతగా ముఖేష్ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ సారథ్యం వ్యవహరిస్తున్నారని తెలిసింది. క్రిప్టోకరెన్సీ రూపకల్పన, దాని విక్రయం వంటి అన్ని అంశాలను ఈ టీమ్ పరిశీలిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా బిట్‌కాయిన్ వంటి ఊహాజనితమైన వర్చ్యువల్ కరెన్సీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
వీటిల్లో పెట్టుబడులకు పెట్టుబడిదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండడంతో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కూడా ఈ వ్యాపారంపై కన్నేసినట్టు లైవ్‌మింట్ పేర్కొంది. బిట్‌కాయిన్ వంటి క్రిపోకరెన్సీలకు పోటీగా తన సొంత క్రిప్టోకరెన్సీ-జియోకాయిన్‌ను తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపింది. అయితే క్రిప్టోకరెన్సీలో పెట్టబుడులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. ఇది చట్టవిరుద్ధమైన కరెన్సీగా ఇప్పటికే స్పష్టంచేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఇందులో పెట్టుబడులు పెట్టరాదని పెట్టుబడిదారులను హెచ్చరించారు. బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులకు గ్యారెంటీ ఉండదని స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment