న్యూఢిల్లీ: అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్‌లో 15 శాతం వాటాను విక్రయించే ప్రణాళికల్లో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నట్లు తాజాగా అంచనాలు వెలువడుతున్నాయి. బుధవారం పీఈ సంస్థ సిల్వర్ లేక్‌కు 1.75 శాతం వాటాను విక్రయించేందుకు డీల్ కుదుర్చుకున్న విషయం విదితమే. ఇందుకు సిల్వర్ లేక్ రూ. 7,500 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో డిజిటల్ అనుబంధ విభాగమైన రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేసిన కంపెనీలకు రిలయన్స్ రిటైల్‌లోనూ వాటాలను ఆఫర్ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రిలయన్స్ జియోలో ఇప్పటికే సిల్వర్ లేక్ రూ. 10,202 కోట్లను ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేసింది. ఇదే విధంగా జియోలో ఇన్వెస్ట్ చేసిన సౌదీ సంస్థలు రిలయన్స్ రిటైల్‌లో వాటాపై కన్నేసినట్లు తెలుస్తోంది.
15 శాతం వాటాకు సై
రిలయన్స్ రిటైల్‌లో 15 శాతం వాటాలను విక్రయించాలని పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యోచిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. తద్వారా రూ. 63,000 కోట్లను సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు ఊహిస్తున్నాయి. సిల్వర్ లేక్ డీల్‌తో రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. కాగా.. రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేసిన సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(పీఐఎఫ్), అబుధబీకి చెందిన ముబదాలా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, అబుధబీ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ(ఏడీఐఏ), ఎల్‌కేటర్‌టన్‌సహా.. పీఈ దిగ్గజం కేకేఆర్.. రిలయన్స్ రిటైల్‌లో వాటా కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
షేరు జూమ్
రిలయన్స్ రిటైల్‌లో 15 శాతం వాటా విక్రయం ద్వారా రూ. 63,000 కోట్లవరకూ సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు వెలువడిన వార్తలు రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ప్రస్తుతం 3 శాతం ఎగసి రూ. 2,223ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం!
కన్సాలిడేషన్
గత నెలలో కిశోర్ బియానీ సంస్థ ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ బిజినెస్‌లను ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ రిటైల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 24,713 కోట్ల డీల్‌ను కుదుర్చుకుంది. తద్వారా దేశీ రిటైల్ రంగంలో కన్సాలిడేషన్ ద్వారా రిలయన్స్ గ్రూప్.. రిటైల్ బిజినెస్‌ను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్(వాల్‌మార్ట్)కు పోటీగా జియో మార్ట్ ద్వారా రిలయన్స్ రిటైల్ వేగంగా విస్తరిస్తున్నట్లు వివరించారు. 2006లో ప్రారంభమైన రిలయన్స్ రిటైల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11,806 స్టోర్లను కలిగి ఉంది.
చదవండి: ము‘క్యాష్’ రిటైల్ స్వారీ..!
Comments
Please login to add a commentAdd a comment