అంబానీ- ఆసియా కుబేరుల్లో రెండు మెట్లుపైనే! | Mukesh Ambanis family Asias richest -Bloomberg index | Sakshi
Sakshi News home page

ముకేశ్‌ కుంటుంబం ఆసియాలోకెల్లా సంపన్నం

Published Wed, Dec 2 2020 2:33 PM | Last Updated on Wed, Dec 2 2020 4:18 PM

Mukesh Ambanis family Asias richest -Bloomberg index - Sakshi

న్యూఢిల్లీ, సాక్షి: దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ తాజాగా కుబేరుల జాబితాలో మరో రికార్డును చేరుకున్నారు. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ విడుదల చేసిన వివరాల ప్రకారం ఆసియాలోకెల్లా అంబానీల కుటుంబం అత్యంత ధనికులుగా రికార్డులకెక్కింది. అంబానీ కుటుంబ సంపద 76 బిలియన్‌ డాలర్లుకాగా.. జాబితాలో రెండో ర్యాంకులో నిలిచిన హాంకాంగ్‌కు చెందిన క్వాక్‌ ఫ్యామిలీ ఆస్తుల విలువ 33 బిలియన్‌ డాలర్లు మాత్రమే. ఇక మూడో స్థానాన్ని పొందిన శామ్‌సంగ్‌ యజమాని లీ కుటుంబ సంపద సైతం 26.6 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. వెరసి అంబానీ కుంటుంబ సంపద రెండో ర్యాంకుకంటే రెట్టింపు, మూడో ర్యాంకుతో పోలిస్తే మూడు రెట్లు అధికంకావడం గమనార్హం! 

10 బిలియన్లు ప్లస్
ఆసియాలో టాప్‌-20 కుబేర కుటుంబాల జాబితాను బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ విడుదల చేసింది. ఈ మొత్తం కుటుంబాల సంపద గతేడాదితో పోలిస్తే 10 బిలియన్‌ డాలర్లు పెరిగి 463 బిలియన్‌ డాలర్లకు చేరింది. అంబానీ కుటుంబ సభ్యుల్లో అడాగ్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ ఆస్తులు క్షీణించినప్పటికీ ముకేశ్‌ అంబానీ గ్రూప్‌ ప్రధాన కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జోరు చూపడం ద్వారా జాబితాలో అగ్రస్థానాన్ని పటిష్ట పరచుకున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ ఇండెక్స్‌ పేర్కొంది. కాగా.. వారసులు లేకపోవడంతో చైనీస్‌ దిగ్గజం అలీబాబా గ్రూప్‌నకు చెందిన జాక్‌ మాను జాబితాకు ఎంపిక చేయలేదని తెలియజేసింది. 

రిటైల్‌, డిజిటల్‌ ఎఫెక్ట్
డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గత కొద్ది రోజులుగా అనుబంధ సంస్థలు రిలయన్స్‌ జియో, రిలయన్స్‌ రిటైల్‌లో విదేశీ పెట్టుబడులను ఆకట్టుకుంటూ వచ్చింది. డిజిటల్‌ విభాగం రిలయన్స్‌ జియోలో వాటాల విక్రయం ద్వారా 20.2 బిలియన్‌ డాలర్లను సమీకరించింది. గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు కేకేఆర్‌, టీపీజీతోపాటు, ఫేస్‌బుక్‌, గూగుల్‌ సైతం వాటాలను కొనుగోలు చేశాయి. ఈ బాటలో రిలయన్స్‌ రిటైల్లోనూ 10 శాతంపైగా వాటా విక్రయంతో రూ. 47,000 కోట్లు సమకూర్చుకుంది. రెండు నెలల్లోనే రిటైల్‌ విభాగంలో భారీగా నిధులు సమీకరించడం విశేషంకాగా.. చమురు, గ్యాస్‌ బిజినెస్‌లు నీరసించినప్పటికీ ప్రధాన కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఈ ఏడాది 50 శాతం ర్యాలీ చేసింది. తద్వారా ముకేశ్‌ అంబానీ సంపదకు 16 బిలియన్‌ డాలర్లు జమైనట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇది ఆసియా కుబేరుల సంపదలో అంతరాన్ని పెంచినట్లు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement